చంద్రబాబు మోసాలపై ప్రజాగ్రహం
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను
ఉపసంహరించుకోవాలి
● యూరియా విషయంలో రాజీపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని పుంజులూరుపాడులో బుధవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేంతవరకు తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పేదలకు వైద్య విద్యనందించాలనే మహోన్నత ఆశయంతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇందులో ఏడింటి నిర్మాణాలు పూర్తికాగా, మిగిలిన పది అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఇవి పూర్తయితే ఆయనకు మంచి పేరొస్తుందనే కుట్రతో ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు పూనుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ పేరుతో హామీలిచ్చి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో బాండ్లను ప్రజలకు పంపిణీ చేసిన అంశాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వీ టిని ఎగ్గొట్టి.. మరుసటి ఏడాది అరకొరగా అమలు చే స్తుండటంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సి వస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలతో పాటు వైద్యం, విద్య దూరమయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంతో వారు పంటలను సంతోషంగా పండించేవారని తెలిపారు. అయితే ప్రస్తుతం యూరియా పంపిణీలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఒక్కో ఎకరాకు మూడు బస్తాలు అంటూ యూరియా కార్డులను పంపిణీ చేస్తున్నారని, ఈ విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


