కొనసాగుతున్న నిరసన
నెల్లూరు(అర్బన్): ఆర్ అండ్ బీ సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దర్గామిట్టలోని శాఖ కార్యాలయంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారంతో ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు మాట్లాడారు. గత వారం వరకు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఈ.. సర్కిల్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం మూడు పదవుల్లో ఉన్న డిప్యూటీ ఇంజినీర్, మరో ఈఈ అవినీతికి అండగా ఉన్నారని, వీరందరిపై శాఖాపరమైన విచారణను జరపాలని డిమాండ్ చేశారు. లంచాలు అడగకుండా పెండింగ్‌లో ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగోన్నతులను వెంటనే అమలు చేయాలని చెప్పారు. వివిధ అంశాలను నెరవేర్చేంత వరకు ఆందోళనను విరమించేదిలేదని స్పష్టం చేశారు. నేతలు రత్నం, పోలయ్య, రాము, శంకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ ఈఓ రేపు
తిరుమల: స్థానిక అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి పది వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో ఫోన్లో భక్తులు నేరుగా మాట్లాడి తమ సందేహాలు, సూచనలను తెలపవచ్చు. దీనికి గానూ 0877 – 2263261 నంబర్‌ను సంప్రదించగలరు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి. స్వామి వారిని 67,091 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకోగా.. తలనీలాలను 21,111 మంది సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.58 కోట్లు సమర్పించారు. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని, ముందుగా వెళ్లినా, అనుమతించరని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
నిబద్ధతతో సంరక్షణ
వసతిగృహాల నిర్వహణ
నెల్లూరు రూరల్: జిల్లాలో చిన్నారుల సంరక్షణ వసతిగృహాలను నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలోని 30 చైల్డ్ కేర్ హోమ్స్‌కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలెక్టరేట్లోని తన చాంబర్‌లో బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జువెనైల్ జస్టిస్ చట్టం – 2015 మేరకు ప్రతి చైల్డ్ కేర్ హోమ్‌ను అన్ని అవసరమైన వసతులతో నిర్వహించాలని సూచించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.. వారి భవిష్యత్తుకు భరోసాగా నిలవాలని పేర్కొన్నారు. దత్తత మాసం కార్యక్రమంలో భాగంగా దత్తతపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఐసీడీఎస్ పీడీ హేనాసుజున్, అధికారి ఫరూక్‌బాషా, జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్, సుమలత, సమత తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన నేడు
నెల్లూరు రూరల్: జిల్లాలోని దగదర్తికి మంత్రి నారా లోకేశ్ గురువారం రానున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దగదర్తిలోని దివంగత మాలేపాటి సుబ్బానాయుడి నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించి.. అనంతరం ఉదయం 11 గంటలకు బయల్దేరనున్నారని పేర్కొన్నారు.
● నెల్లూరు, దగదర్తిలో పలు కార్యక్రమాల్లో మంత్రి ఫరూక్ పాల్గొనన్నారని కలెక్టర్ తెలిపారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించి, ఆపై నారా లోకేశ్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.
కొనసాగుతున్న నిరసన


