భూములపై గద్దల్లా వాలుతూ..
ఇదీ కత..
● బరితెగిస్తున్న టీడీపీ నేతలు
● భూ కబ్జాకు రంగం సిద్ధం
● జొన్నవాడలో నిత్యం ఆక్రమణలు
● ప్రేక్షకపాత్ర వహిస్తున్న అధికారులు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మండలంలోని జొన్నవాడలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి చెందిన 40 అంకణాల భూమిని స్థానిక టీడీపీ నేతల చొరవతో ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఇటీవల యత్నించారు. విషయం బయటకు రావడం.. సదరు స్థలంపై కావలి రెవెన్యూ కోర్టులో కేసు నడుస్తుండటంతో ఆ యత్నాలను విరమించుకున్నారు. తాజాగా గ్రామంలో పెన్నా పొర్లుకట్టకు ఆనుకొని ఉన్న ఎకరా స్థలాల్ని టీడీపీ నేతల ప్రోద్బలంతో కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది.
కాసులు కురిపిస్తూ..
జొన్నవాడలో వెలసిన మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి భక్తులు నిత్యం వస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్థిక స్తోమత కలిగిన వారు ఇక్కడ భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది స్థానిక టీడీపీ నేతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. గుడి, బడి, ప్రభుత్వ భూమి అనే తేడా లేకుండా రెవెన్యూ రికార్డులను మార్చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పెన్నా పొర్లుకట్టను ఆనుకొని సర్వే నంబర్ 92లో ఉన్న ఎకరా ఇరవై సెంట్ల స్థలం గ్రామ ప్రధాన రహదారి, ఆలయానికి అతి దగ్గర్లో ఉంది. దీని విలువ ప్రస్తుతం రూ.కోట్లల్లో ఉంటుంది. ఈ క్రమంలో దీన్ని కొల్లగొట్టేందుకు తమ్ముళ్లు యత్నిస్తున్నారు.
తప్పుదోవ పట్టిస్తూ..
ప్రస్తుతం అధికారులను సింధు తప్పుదోవ పట్టిస్తున్నారు. సర్వే నంబర్ 92లో ఉన్న ఎకరా ఇరవై సెంట్ల భూమిని తమకు స్వాధీనం చేయాలంటూ జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని గత వారంలో అందజేశారు. సదరు భూమి వ్యవహారం హైకోర్టు పరిధిలో విచారణలో ఉండటం.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉండటంతో ఇలా కోరడం నిబంధనలకు విరుద్ధం. అయితే టీడీపీ జొన్నవాడ నేతల చొరవతో ఈ వ్యవహారమంతా నడుస్తోందని సమాచారం. కాగా కబ్జా విషయమై తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
గత ప్రభుత్వ
హయాంలో పక్కాగా..
సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు నదులు, చెరువులు, కాలువలు, కుంటలు పక్కన ఉన్న భూములను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రీ సర్వే చేశారు. ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై ఉన్నా.. వాటిని తొలగించి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో పొందుపర్చారు. ఇందులో భాగంగానే జొన్నవాడలోని 92 సర్వే నంబర్‌లో ఉన్న ల్యాండ్‌ను ప్రభుత్వ భూమిగా మార్చారు.
జొన్నవాడలో ప్రస్తుతం ఆక్రమించేందుకు సిద్ధమైన ఎకరా.. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉంది. నెల్లూరుకు చెందిన పందిళ్లపల్లి అరుణమ్మ, ఆమె భర్త పట్టాభిరామిరెడ్డి కలిసి ప్రియదర్శిని మహిళా మండలి పేరుతో కాస్ట్ ఆఫ్ సేల్ కింద 92 సర్వే నంబర్‌లో పెన్నా పొర్లుకట్టకు ఆనుకొని ఉన్న ఎకరా ఇరవై సెంట్ల భూమిని ఇవ్వాలని 2012లో కోరారు. అప్పటి తహసీల్దార్.. రికార్డుల్లో ఉన్న పెన్నా పొర్లుకట్ట అనే పదాన్ని తొలగించి అనాధీనమని పొందుపర్చారు. అరుణమ్మకు అనుకూలంగా రికార్డులను తయారు చేశారు. అయితే మహిళా మండలి పేరుతో ఎలాంటి సొసైటీని నడపలేదని స్థానికులు పేర్కొంటున్నారు. స్థల ఆక్రమణ విషయమై రెవెన్యూ అధికారులకు అర్జీలను గ్రామస్తులు గతంలో అందజేశారు. అయితే అరుణమ్మ వద్ద ముడుపులు పుచ్చుకొని అప్పటి అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన కొందరు గ్రామస్తులు స్థలాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో దావా వేశారు. అయితే 2016లో అరుణమ్మ మరణించడంతో ఆమె కోడలు సింధు, భర్త హేమంత్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.


