రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ఏసీబీ అలజడి | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ఏసీబీ అలజడి

Nov 6 2025 7:50 AM | Updated on Nov 6 2025 7:50 AM

రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ఏసీబీ అలజడి

రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ఏసీబీ అలజడి

నెల్లూరు సిటీ: నగరంలోని స్టోన్‌హౌస్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలకు ఏసీబీ అధికారులు బుధవారం రావడంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్‌ శాఖలో అలజడి రేగింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. స్టోన్‌హౌస్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలను నెల్లూరు ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌, ఎస్సై గీతాంజలి తమ సిబ్బందితో కలిసి చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న ప్రైవేట్‌ వ్యక్తులు, పలువురు డాక్యుమెంట్‌ రైటర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా, కొత్తవారు లోపలికి రాకుండా తలుపులేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏడాదిగా జరిగిన రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాలపై వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు, ఈసీలు, మార్కెట్‌ వాల్యూ రికార్డులనూ పరిశీలిస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సుమలత రెండు రోజులుగా.. సీనియర్‌ అసిస్టెంట్‌ విశ్వనాథ్‌ బుధవారం సెలవులో ఉండటంతో ఉన్న సిబ్బంది నుంచి వివరాలను సేకరిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు రూ. 62 వేలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

చల్లగా జారుకొని..

ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొందరు అధికారులు, సిబ్బంది చల్లగా జారుకున్నారు. క్రయ విక్రయదారులు, డాక్యుమెంట్‌ రైటర్లతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయాలు ఒక్కసారిగా బోసిపోయాయి. మరోవైపు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయాలకు సమాచారం నిమిషాల్లో చేరింది. దీంతో అక్కడ ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్లు పత్తాలేకుండాపోయారు. ఆర్వో వద్ద కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు తమ ఆఫీసులకు తాళాలేసి వెళ్లారు.

నేడూ తనిఖీలు

రిజిస్ట్రేషన్స్‌ శాఖపై ప్రజల నుంచి ఆరోపణలొచ్చాయని, దీంతో డీజీ ఆదేశాల మేరకు స్టోన్‌హౌస్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలను చేపట్టామని నెల్లూరు ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. ఆ సమయంలో ఇతర వ్యక్తులు, రైటర్లు ఉన్నారని, వీరినీ విచారించనున్నామని చెప్పారు. కొంత నగదు దొరికిందని, రికార్డుల పరిశీలన గురువారం సైతం కొనసాగనుందని వివరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సెలవులో ఉన్నారని, దీనిపై సైతం విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

స్టోన్‌హౌస్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయంలో తనిఖీలు

అదుపులో పలువురు ప్రైవేట్‌

వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్లు

కీలక రికార్డులు, నగదు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement