ఆగని గ్రావెల్ దందా
● కొండను పిండి చేస్తున్న టీడీపీ నాయకులు
పొదలకూరు: ఇటీవల వర్షాల కారణంగా కొద్దిరోజులు గ్రావెల్ అక్రమ దందాకు విరామమిచ్చిన టీడీపీ నాయకులు తిరిగి ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా బరితెగించి కొండ కింద జేసీబీ యంత్రాలతో పెద్ద గోతులను తవ్వి గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు అటువైపు వెళ్లకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని యర్రబల్లిలో వర్షాలకు ముందు వరకు గ్రామ సమీపంలోని కొండ కింద గ్రావెల్‌ను అక్రమంగా లోడి తరలించేవారు. గుంతల్లో వాననీరు చేరడంతో కొద్దిరోజులు ఈ తంతు ఆగింది. అయితే వర్షాలు తగ్గడంతో మళ్లీ గ్రావెల్ తవ్వకాలను మొదలుపెట్టినట్టు జనం వెల్లడించారు. ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల్లో ఓ వర్గం టిప్పర్లను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించడంతో గందరగోళం నెలకొంది. తర్వాత కొద్దిరోజులు సద్దుమణిగినా మళ్లీ మొదలెట్టారని అంటున్నారు. ప్రజాప్రయోజనాల పేరుతో గ్రావెల్‌ను తరలిస్తూ మరోవైపు తవ్వకాలు యథేచ్ఛగా సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. పశువుల మేత పోరంబోకు కింద కొండను గ్రామస్తులు ఉపయోగిస్తున్నారని గ్రావెల్ తవ్వకాలతో మేతకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. అంతేకాక సెలవుల్లో పిల్లలు ఆడుకునేందుకు వెళ్లి గోతుల్లో ఉన్న నీటిలో పడితే ప్రాణాలకే ప్రమాదమని వాపోతున్నారు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని దీనికి అడ్డుకట్ట వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.


