మహిళ అనుమానాస్పద మృతి
● గుర్తుపట్టలేని విధంగా మృతదేహం
● విభిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు వనంతోపు సెంటర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో కల్వర్టులు, కాలువలకు వాడే సిమెంట్ పైపుల మధ్య గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బుధవారం బహిర్బూమికి వెళ్లిన ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్.. మృతదేహాన్ని గుర్తించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ బి.కల్యాణరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వయసు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. ఎరుపు రంగు చీర ధరించి ఉంది. మృతదేహం పక్కనే వివాహ సమయంలో వరుడు ధరించే తలపాగా పడి ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారై తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పలుచోట్ల చర్మం ఊడిపోయి ఉంది. దీనిని బట్టి చూస్తే ఆమె మృతిచెంది సుమారు 20 రోజులకుపైగా అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 20/1వార్డు వీఆర్వో చేజర్ల తేజ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
బృందాల ఏర్పాటు
ఇన్‌స్పెక్టర్ కల్యాణరాజు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఒంటిపైనున్న దుస్తులు, పక్కన పడి ఉన్న తలపాగా తదితరాల ఆధారంగా ఆమె సంపన్న వర్గానికి చెందినదై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె అసలు ఘటన జరిగిన ప్రాంతానికి ఎందుకొచ్చింది?, ఎవరు తీసుకువచ్చారు?, ఆత్మహత్య చేసుకందా?, ఎవరైనా హత్యచేసి పడేశారా? ఇలా అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో మృతురాలి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇటీవల జిల్లాలో నమోదైన మహిళల అదృశ్యం కేసుల వివరాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టంలో తెలిసే అవకాశం ఉంది.


