 
															సిఫోర్స్‌కే సీట్లు
●
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని వీఆర్ న్యాయ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో న్యాయ విద్యకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు ఇతర ప్రాంతాల్లో లా సీటుకు అడ్మిషన్ ఫీజు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీఆర్‌లో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. లా సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటాలో కొన్నింటిని కేటాయిస్తారు. దీని విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లున్నట్లు తెలిసింది.
మొత్తం 420 సీట్లు
వీఆర్ న్యాయ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 3 ఏళ్ల లా కోర్సులో 240, ఐదేళ్ల కోర్సులో 96 సీట్లున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద 3 ఏళ్ల కోర్సులో 60, ఐదేళ్ల కోర్సులో 24 సీట్లున్నాయి. ఈ ఏడాది జూన్‌లో లాసెట్ జరిగింది. మూడేళ్లకు రూ.13,500, ఐదేళ్లకు రూ.13 వేలు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి లైబ్రరీ, పరీక్ష ఫీజు అదనం. కన్వీనర్ కోటాలో లాసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లు పొందే వారు సొంతంగా ఫీజు చెల్లించాలి.
మేనేజ్‌మెంట్ కోటాలో చేరాలంటే..
కళాశాలలో బుధవారంతో తొలివిడత సీట్ల అలాట్‌మెంట్ ముగిసింది. వచ్చేనెల మొదటి వారంలో మేనేజ్‌మెంట్ కోటా కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీని కింద అడ్మిషన్ పొందాలంటే స్థానికులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో చదివినట్లు ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్ సమర్పించాలి. దీంతోపాటు డిగ్రీలో వచ్చిన పర్సంటేజీని పరిగణలోకి తీసుకుంటారు. ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్‌ను పొందుపరచాలి. బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఇవన్నీ ఇస్తేనే సీట్ల కేటాయింపు జరుగుతుంది.
నిబంధనలకు విరుద్ధం
నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల లేఖలతో సీట్లు ఇస్తున్నట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. నేతలు కూడా తమ అనుయాయులకు సీట్లు ఇప్పించుకునేందుకు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే విద్యాసంస్థలకు సెక్రటరీగా జేసీపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారికి అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి చెందిన 40 నుంచి 50 మంది వరకు చదువుతున్నట్లు సమాచారం. నాన్ లోకల్ కింద ఉన్న వీరికి కళాశాలలో ఏ విధంగా అడ్మిషన్ ఇచ్చారో సమాధానం చెప్పాల్సి ఉంది.
సంఘంగా ఏర్పడి..
మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఇప్పించేందుకు పూర్వ విద్యార్థులు కొందరు సంఘంగా ఏర్పడి ప్రలోభాలు పెడుతున్నార్న ప్రచారం జరుగుతోంది. కొందరి నుంచి డబ్బులు తీసుకుని అడ్మిషను ఇప్పిస్తున్నారని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్న మాట. దీంతోపాటు లాసెట్‌లో ర్యాంకుల ఆధారంగా సీటు వచ్చిన వారి నుంచి సైతం అన్ని తామే చూసుకుంటామని అదనంగా నగదు తీసుకుంటున్నార్న ఆరోపణలున్నాయి. మొత్తం వ్యవహారాలు జేసీకి తెలిసి జరుగుతున్నాయా?, ఆయన్ను పక్కదోవ పట్టిస్తున్నారా? అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది.
నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు
వీఆర్ లా కళాశాలలో నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నాం. మేనేజ్‌మెంట్ కోటాలో డిగ్రీలో అత్యధిక పర్సంటేజీ ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాం. లోకల్ కాకుండా నాన్‌లోకల్ విద్యార్థులకు ఈ కళాశాలలో చేరే అవకాశం లేదు.
– శ్రీధర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్
వీఆర్ లా కళాశాలలో ముగిసిన
తొలివిడత అలాట్‌మెంట్
మేనేజ్‌మెంట్ కోటాలో ఇతర
ప్రాంతాల్లో అడ్మిషన్ ఫీజు ఎక్కువ
ఇక్కడికి విద్యార్థుల పరుగులు
ఇష్టారాజ్యంగా కేటాయింపు
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు
అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ
పూర్వ విద్యార్థుల ప్రలోభాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
