 
															పంట నష్టాన్ని తక్కువగా చూపాలనే దుర్మార్గపు ఆలోచన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ప్రచారార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. తుఫాన్‌తో సంభవించిన పంటల నష్టాన్ని తక్కువగా చూపాలనే దుర్మార్గపు ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అన్నదాతలను అన్ని విధాలా వంచించిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని చంద్రబాబు చెప్తుంటారని, ఇందులోనూ తన ప్రచారాన్ని ఎలా పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన గానీ.. ఇంగిత జ్ఞానం లేదన్నారు. గతంలో రైతులకు ఏ సమస్యొచ్చినా ఆర్బీకేలను సంప్రదించేవారని, అయితే ఇప్పుడు వీటిని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పునరావాస కేంద్రాలను పరిశీలించేందుకెళ్తే, ఈ పనికిమాలిన ప్రభుత్వం అక్కడి బాధితులకు అన్నం పెట్టడంలేదని చెప్పారు. అదే తమ హయాంలో మిడ్ డే మీల్స్ వారితో మంచి భోజనాలు పెట్టామని గుర్తుచేశారు. గతంలో సర్వేపల్లిలో మాత్రమే రిహ్యాబిలిటేషన్ సెంటర్లు ఉండేవని, అయితే నాడు – నేడు ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో ప్రతి గ్రామంలో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని అంచనాలిచ్చారని, రూ.96.27 కోట్ల నష్టాన్ని చూపారని, ఇందులో ఈ ఎమ్మెల్యేలు ఇరిగేషన్ పనులకు రూ.67,34 కోట్లు పెట్టుకున్నారన్నారు. ఇవన్నీ దొంగ బిల్లులనీ.. రైతులు పంటలు నష్టపోయి.. రోడ్లకు గుంతలు పడి రకరకాల ఇబ్బందులు పడుతుంటే.. ఇలా ఎమర్జెన్సీ వర్కుల కింద బిల్లులు పెట్టుకొని కూటమి ఎమ్మెల్యేలు తలా కొంచెం పంచుకుంటున్నారని ఆరోపించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
