 
															హమ్మయ్య.. బయటకు బోటు
బోటును తీసుకొస్తూ..
● ముమ్మర చర్యలతో తప్పిన ప్రమాదం
సంగం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సంగం బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చిన మూడు బోట్లను అధికారులు బయటకు తీయించగలిగారు. 35 టన్నుల బరువున్న బార్ట్ బోటు సంగం బ్యారేజీకి కొద్ది దూరంలో చిక్కుకుందనే సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వెజెండ్లతో కలిసి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించగలిగారు.
రంగంలోకి రెస్క్యూ టీమ్
మూడు పడవల్లో రెండింటిని వెలికితీశారు. మూడో బోటు సంగం బ్యారేజీకి కొద్ది దూరంలోని పాత బ్యారేజీ రోడ్డు వద్ద చిక్కుకుపోయింది. సుమారు 35 టన్నుల బరువున్న భారీ బోటు రిజర్వాయర్ గేట్లకు తగిలితే నష్టం సంభవించొచ్చనే అంచనాతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగారు. బార్ట్ బోటును వెలికితీసేందుకు గానూ ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్మంది వద్ద ఉన్న ఫైబర్ రెస్క్యూ బోట్ల సామర్థ్యం సరిపోదని అంచనా వేశారు. ఈ తరుణంలో మత్స్యశాఖ అధికారుల ద్వారా మరో రెండు బోట్లను కృష్ణపట్నం నుంచి రంగంలోకి దించారు. రెండు బోట్ల ద్వారా బలమైన రోపులను ఉపయోగించి చిక్కుకుపోయిన భారీ బోటును ప్రధాన బ్యారేజీ గేట్లను ఢీకొనకుండా ఒడ్డుకు లాగి ప్రమాదాన్ని నిరోధించారు. సమష్టిగా కృషి చేసిన వారు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సంగం సీఐ వేమారెడ్డి, డీఎస్పీ వేణుగోపాల్, ఆర్డీఓ పావని, తహసీల్దార్ సోమ్లానాయక్, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు రాజేష్, తిరుమలరావు, సైదులు, జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
