 
															చెరువులు కాదు.. రియల్ వెంచర్లు
● లోతట్టు ప్రాంతాలు, చెరువులు,
వాగు ప్రవాహ మార్గాల్లో వేసిన వైనం
● భారీ వర్షాలకు పొంగిన చెరువులు
● ఆనవాళ్లు లేకుండా పోయాయి
● లబోదిబోమంటున్న ప్లాట్ల
కొనుగోలుదారులు
కందుకూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారుల బండారాన్ని మోంథా తుపాను బట్టబయలు చేసింది. కందుకూరు పట్టణంలో గోల్డెన్ సిటీ, ఫార్చూన్ సిటీ, స్కంధపురి వెంచర్, జాతీయ రహదారి పక్కన అంటూ వేసిన వెంచర్లు భారీ వర్షాల దెబ్బకు అడ్రస్ లేకుండా పోయాయి. పట్టణ చుట్టుపక్కల వేసిన వెంచర్లన్నీ దాదాపు చెరువులనే తలపించాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన తియ్యని మాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి లబోదిబోమంటున్నారు.
మాయ చేసి..
ఇటీవల కాలంలో కందుకూరు పట్టణానికి సమీపంలోనే 167బీ జాతీయ రహదారి రావడంతో దానికి ఇరువైపులా భూములకు రెక్కలొచ్చాయి. విక్కిరాలపేట రోడ్డు, కనిగిరి రోడ్డు, పామూరు రోడ్డు వంటి ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వేశారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం వచ్చి ప్లాట్లు పెట్టారు. వాటికి ౖపైపె మెరుగులు దిద్ది ఇక్కడ కొంటే అనతి కాలంలోనే రెండు, మూడు రెట్లు పెరుగుతుందంటూ ఊదరగొట్టారు. గజం భూమి రేటును రూ.లక్షల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలకు అంటగట్టారు. దీంతో తమ పనైపోయిదంటూ వ్యాపారులు చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. ప్లాట్లు కొన్నవారు ప్రస్తుతం వాటి పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు.
నిబంధనలు పట్టవు
ప్రస్తుతం కందుకూరు పట్టణ శివారు ప్రాంతాల్లో వెంచర్లు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించ లేదనే విమర్శలున్నాయి. అలాగే పర్యవేక్షించాల్సిన మున్సిపల్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ స్థలాలను, కాలువలను ఆక్రమించి వెంచర్లు వేయడం సరికాదనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ఇటువంటి వెంచర్లలో ప్లాట్లు కొంటే భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
