నెల్లూరు(క్రైమ్): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆకట్టుకుంది. తొలుత దీన్ని ఏఎస్పీ సౌజన్య ప్రారంభించారు. అనంతరం విధి నిర్వహణలో పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రత పరికరాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు సేవచేయాలనే స్ఫూర్తిని నింపారు. మెటల్ డిటెక్టర్, ఫింగర్ ప్రింట్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్, సెల్‌జామర్, వీహెచ్‌ఎఫ్ సెట్, ట్రాఫిక్ నియంత్రణ పరికరాలు, రోడ్డు సేఫ్టీ వాహనాలు, డాగ్, బాంబ్‌స్క్వాడ్, డ్రోన్స్ తదితరాల పనితీరును వివరించారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, చెంచురామారావు, చంద్రమోహన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ర్యాలీ
కొవ్వొత్తుల ర్యాలీని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జోహార్ అమరవీరులారా అంటూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడలి వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
