 
															ప్రజా సమస్యలు పట్టవా..?
నెల్లూరు(పొగతోట): మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా ప్రజానీకం తీవ్రంగా నష్టపోయింది. చేతికందే దశలో పంట నీళ్లపాలవడంతో అన్నదాతల కన్నీరు అంతా ఇంతా కాదు. దీని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ తరుణంలో గళమెత్తి ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పత్తాలేకుండాపోయారు. నెల్లూరులో గురువారం నిర్వహించాల్సిన జెడ్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. ప్రజాసమస్యలపై వీరికుండే చిత్తశుద్ధి ఇదేనానే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రైవేట్ కార్యక్రమానికే పెద్దపీట
వాస్తవానికి జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల అనుమతితో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలతో జిల్లాలో సంభవించిన నష్టంపై చర్చ జరిగి రైతులకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అయితే దీని కంటే ప్రైవేట్ కార్యక్రమమే తమకు ముఖ్యమనే రీతిలో ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూఖ్ నెల్లూరొచ్చినా సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలూ ఇదే తీరును అవలంబించారు.
కోరం లేక వాయిదా
సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, ఆర్ అండ్ బీ తదితర శాఖలతో సమీక్షించాల్సి ఉంది. జిల్లా శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 10.30కు సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో 11.45 గంటల వరకు నిరీక్షించారు. ఆరుగురు జెడ్పీటీసీలు, నలుగురు ఎంపీపీలే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ప్రకటించారు. కాగా కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయడం ఇది రెండోసారి
నిండా ముంచిన మోంథా తుఫాన్
చేతికందే పంట నీళ్లపాలవడంతో
అన్నదాత కన్నీరు
నష్టంపై గళమెత్తాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు జెడ్పీ సమావేశానికి దూరం
జిల్లాకు వచ్చినా హాజరుకాని
ఇన్‌చార్జి మంత్రి
గత్యంతరం లేక వాయిదా వేసిన చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
 
							ప్రజా సమస్యలు పట్టవా..?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
