సురక్షిత ప్రాంతాలకు వావింటపర్తి వాసులు
● వర్షంలోనూ స్పిల్‌వే కాలువ పనులు
● అంకుపల్లి చెరువు మీదుగా నీరు
● నేడు నీరు విడుదల చేసే అవకాశం
పొదలకూరు: భారీ వర్షంలోనూ కండలేరు స్పిల్‌వే కాలువ పనులు జరుగుతున్నాయి. స్పిల్‌వేకు కాలువ సక్రమంగా లేకపోవడంతో కండలేరులో పొర్లిన నీటిని బయటకు పంపడం తెలుగుగంగ అధికారులకు సమస్యగా మారింది. దీంతో కాలువను తవ్వుతూనే మరోవైపు జంగిల్‌ను క్లియర్ చేయిస్తున్నారు. నీటిని విడుదల చేస్తే తమ గ్రామాలకు ఇబ్బందిగా మారుతుందని పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి వాసులు భయపడుతున్నారు. వావింటపర్తికి పెద్ద నష్టమే జరుగుతుందంటున్నారు. ముందుగా ఈ గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది మహిళలు, వృద్ధులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. యువకులు మాత్రమే ఉన్నారు. పోలీసులు ధైర్యం చెపుతున్నా గ్రామంలోకి నీరు చేరుతుందని భీతిల్లుతున్నారు.
చెరువు నిండి..
స్పిల్‌వేకు సమీపంలో ఉన్న అంకుపల్లి చెరువు మీదుగా కండలేరు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అంకుపల్లి చెరువు నిండి కలుజు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ చెరువు మీదుగా వావింటపర్తి వాగుకు నీటిని విడుదల చేస్తే అక్కడి నుంచి కండలేరు ఏటి కాలువకు చేరుతుంది. తర్వాత మనుబోలు మండలం గ్రామాల మీదుగా గూడూరు రూరల్ మండలం మిట్టాత్మకూరు బ్రిడ్జి కింద మనుబోలు హైవే నుంచి సముద్రం పాలయ్యేలా అధికారులు నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విడుదలకు అవకాశం
పరిస్థితిని బట్టి స్పిల్‌వే నుంచి కండలేరు జలాలను కాలువకు బుధవారం సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారు వెల్లడించారు. కాలువ తవ్వకంతోపాటు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవ్వొచ్చని, దాదాపుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందంటున్నారు. వావింటపర్తి గ్రామస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతానికి బుధవారం తరలిస్తామని తహసీల్దార్ బి.శివకృష్ణయ్య వెల్లడించారు.


