భక్త వల్లభా.. నీ దర్శనం దుర్లభం | - | Sakshi
Sakshi News home page

భక్త వల్లభా.. నీ దర్శనం దుర్లభం

Oct 28 2025 7:32 AM | Updated on Oct 28 2025 7:32 AM

భక్త వల్లభా.. నీ దర్శనం దుర్లభం

భక్త వల్లభా.. నీ దర్శనం దుర్లభం

కార్తీక మాసం తొలి సోమవారం ఎంతో భక్తి ప్రపత్తులతో మూలస్థానేశ్వరాలయానికి వెళ్లిన భక్తులకు దేవదాయశాఖ అధికారులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబెట్టి చుక్కలు చూపించారు. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్‌, న్యాయమూర్తులు వంటి వీఐపీలు వస్తే వారికి ప్రత్యేక దర్శనం కల్పించడం గౌరవనీయం. కానీ ఎమ్మెల్యే, ఎంపీ వేలు విడిచిన చుట్టాలకు సైతం వీఐపీలకు మించి ప్రాధాన్యమిచ్చి అంతరాలయంలో గంటల పాటు పూజలు చేయించడంలో ఈఓ నుంచి సిబ్బంది వరకు తరించారు. ఈ క్రమంలో సహనం నశించిన భక్తులు అసహనంతో పవిత్రమైన ఆలయంలోనే దేవదాయశాఖ అధికారుల తీరుపై కర్ణకఠోర తిట్లు లంకించుకోవడంతో అక్కడే విధుల్లో ఉన్న చిన్నబజారు సీఐ తన సిబ్బందిని అంతరాలయం వద్ద పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు (బృందావనం): సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో దర్శనం చేసుకొనే వీలు కల్పించాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరొక వైపు నెల్లూరు ఆర్డీఓ సమీక్ష సమావేశాలు నిర్వహించి దేవదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని దేవదాయశాఖాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని భక్తులు మండి పడుతున్నారు. నగరంలోని మూలాపేటలో కొలువైన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ప్రాశస్త్యంతోపాటు భక్త వల్లభుడిగా పేరొంది. నిత్యం భక్తుల తాకిడితో ఉండే ఆలయానికి సోమవారంతోపాటు ప్రత్యేక రోజులు, పవిత్ర కార్తీక, మహాశివ రాత్రి మాసాలు, బ్రహ్మోత్సవాల సందర్భంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దేవదాయ శాఖాధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనంతోపాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కార్తీక తొలి సోమవారం భారీగా తరలివచ్చిన భక్తులు టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లలోకి వచ్చారు. వీరితోపాటు ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలో గంటల కొద్దీ నిలిపేసి, భక్త వల్లభుడైన పరమేశ్వర దర్శనం దుర్లభం అయింది. కూటమి ప్రజాప్రతినిధులు స్వామి దర్శనానికి రావడంతో సదరు దేవదాయశాఖాధికారులు వారిని ప్రత్యేక మార్గంలో నేరుగా స్వామి అంతరాలయంలోకి తీసుకెళ్లి గంటల కొద్దీ విశేష పూజలు చేయించి తీర్థప్రసాదాలిప్పించి పంపించేంత వరకు వారి సేవలో తరించారు.

ఉద్యోగులు, వ్యాపారుల ఇబ్బందులు

కార్తీక సోమవారం స్వామిని దర్శించుకుని విధులకు హాజరు కావాలనుకున్న ఉద్యోగులు, దుకాణాలు తెరుచుకోవాల్సిన వ్యాపారులు ఇంటి పనులు చక్కబెట్టుకునే గృహిణులు, చిన్న పిల్లలతో కలిసి వచ్చిన మహిళలు, త్వరగా వెళ్లాలనే ఆతృతతో వచ్చారు. వీరితో కొందరు ప్రత్యేక దర్శనాలకు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ప్రజాప్రతినిధులెవరూ రాకున్నప్పటికీ వీఐపీల పేర్లు చెప్పి వచ్చే చెంచాగాళ్లు, వీరి చెంచాగాళ్లకు అడుగులకు మడుగులొత్తుతూ దేవస్థానం అధికారి తానే దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించడపై భక్తులు మండిపడ్డారు. సకాలంలో దర్శనం కాక నానా పాట్లు పడ్డారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బంధువు, కాంట్రాక్టర్‌ ఒకరు ఉదయం స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆ కాంట్రాక్టర్‌కు ఎటువంటి ప్రోటోకాల్‌ లేకపోయినప్పటికీ ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి ఓ ప్రజాప్రతినిధికి, ఓ ఉన్నతాధికారికి ఇచ్చే రీతిలో ఆహ్వానం పలుకుతూ అంతరాలయ దర్శనం చేయించడంతో దాదాపు రెండు గంటల పాటు మూలస్థానేశ్వరుడి దర్శనం కాక భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సిబ్బందిని, కార్యనిర్వహణాధికారి నిలదీశారని సమాచారం. గంటల తరబడి క్యూలైన్లలో నిలిచిపోయిన భక్తులు దేవదాయశాఖాధికారులపై కర్ణ కఠోరంగా తిట్ల దండకం చేస్తుండడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న చిన్నబజారు సీఐ చిట్టెం కోటేశ్వరరావు బాధతో తట్టుకోలేక సిబ్బందిని లోపలికి పంపించి వీఐపీ దర్శనాలను ఆపేసి సామాన్య భక్తుల క్యూను ముందుకు సాగేలా చేశారు. పనీబాట లేని గాలోళ్ల కోసం తమ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ భక్తులు మండిపడుతున్నారు. మేము భక్తులం కాదా? మాకు పనులు లేవా? అవసరాలు లేవా? అంటూ అసహనంతో రగిలిపోయారు. ఒక దశలో పూజారులు అందరిని సమానంగా చూడాలని క్యూలైన్‌లో వచ్చే వారికి దర్శనం కలిగించాలని చెబుతున్నప్పటికీ వారి మాటలను సైతం ఈఓ ఖాతరు చేయడం లేదన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా దేవదాయశాఖాధికారులు సామాన్య భక్తులకు సేవలందించేలా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భక్తులు మూలస్థానేశ్వరస్వామిని వేడుకుంటున్నారు.

పరమేశ్వర దర్శనానికి పడరాని పాట్లు

వీఐపీల వేలు విడిచిన చుట్టాల సేవలో తరిస్తున్న అధికారులు, ఉద్యోగులు

సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టేస్తున్న వైనం

కార్తీక మాసం తొలి సోమవారం భక్తుల అసహనం

మూలస్థానేశ్వరాలయంలో

ఈఓ ఇష్టారాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement