భయం భయంగా..
పొదలకూరు: ముందుచూపు లేకపోవడంతో కండలేరు జలాశయం కింద గ్రామస్తులతోపాటు తెలుగుగంగ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కండలేరులో నవంబర్ నెలకు ముందే భారీగా నీటిని నిల్వ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్పిల్‌వే దిగువ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు సైతం రైతులకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సమీప నిమ్మతోటలు నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్పిల్‌వే నుంచి నీటిని విడుదల చేసేందుకు తెలుగుగంగ, రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. 560 మీటర్ల అటవీ భూములు కాలువ అలైన్మెంట్లో ఉండటంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్టు వారు చెబుతుండగా.. దిగువ ప్రాంత గ్రామస్తులు మాత్రం మా కొంప మునిగేలా ఉందంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 58.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కాలువ తవ్వి జంగిల్ క్లియరెన్స్
అటవీ భూముల్లో కాలువను 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు తవ్వి అంకుపల్లి వంతెన వరకు అధికారులు జంగిల్ క్లియరెన్స్‌ను చేపడుతున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా మోంథా తుపాను ప్రభావంతో పైతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జలాశయంలోకి నీరు చేరితే వెంటనే స్పిల్‌వే నుంచి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాలువ సామర్థ్యాన్ని బట్టి ముందుగా ఒక షట్టర్ ద్వారానే నీటిని విడుదల చేయనున్నారు. అయితే జలాశయంలో స్పిల్‌వే షట్టర్ల వద్ద నీరు మూడు అడుగుల కింద వరకు చేరినట్టు సమాచారం. నీటిమట్టం పెరిగితే షట్టర్ల పైనుంచి నీరు పొర్లే అవకాశం కూడా ఉంటుందంటున్నారు.
గ్రామస్తుల అప్రమత్తం
స్పిల్‌వే దిగువ ప్రాంత గ్రామాలైన పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం కూడా పొదలకూరు, రాపూరు తహసీల్దార్లు బి.శివకృష్ణయ్య, లక్ష్మీనరసింహం పర్యటించారు. వావింటపర్తి వంతెనకు సమీపంలో ఉన్న కుటుంబాలు, పర్వతాపురం ఎస్సీకాలనీ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారు.
చెరువులు కట్టలు తెగే అవకాశం
స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేస్తే పులికల్లు, అంకుపల్లి చెరువులు కట్టలు తెగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందస్తుగా రెండు చెరువుల కలుజులను తొలగిస్తే వచ్చే నీరు వేగంగా బయటకు వెళ్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాక చెరువుల్లో చేరిన నీటిని ముందుగా బయటకు పంపే యోచన కూడా ఉందని తెలిసింది. ఎలాంటి చర్యలు చేపట్టినా దిగువ గ్రామాల నిమ్మతోటలు నీట మునిగే పరిస్థితులున్నట్టు ఆయా గ్రామస్తులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
నిండుకుండలా కండలేరు జలాశయం
స్పిల్‌వే దిగువ ప్రాంత గ్రామస్తుల
ఆందోళన
కాలువను తవ్విస్తున్న అధికారులు
నిమ్మతోటలు మునిగే అవకాశం
భయం భయంగా..
భయం భయంగా..


