నేడూ విద్యాసంస్థలకు సెలవు
నెల్లూరు (అర్బన్): జిల్లాపై మోంథా తుఫాన్ ప్రభావం చూపుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చిరు జల్లులుగా పడుతున్న వర్షం రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. మంగళవారం నాటికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఇప్పటికే వాతావరణశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాగులు, వంకలతోపాటు పలు చెరువులు కలుజులు పారుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో రాళ్లపాడు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సంగం వద్ద పెన్నానదిలో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద నెల్లూరు వైపు ప్రవహిస్తోంది. బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు, గండిపాళెం ప్రాజెక్ట్, నక్కల వాగు, కండలేరు కాలువ, కై వల్యానది, పంబలేరు, చిప్పలేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్, బకింగ్ హామ్ కెనాల్స్‌లో వరద నీరు ప్రవహిస్తోంది.
అత్యవసర ఖర్చులకు రూ.2 కోట్లు
జిల్లాలో తుఫాను రక్షణ చర్యల్లో అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
జిల్లాలో తుఫాన్ నష్టాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ యువరాజ్ అధికారులకు సూచించారు. సోమవారం తుఫాను నష్టనివారణ ముందస్తు చర్యలపై కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి యువరాజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మెడికల్, హెల్త్, ఐసీడీఎస్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజలు ఫోన్ చేసిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తుఫాన్ నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వం సిద్ధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. 9 తీర మండలాల్లోని 42 సెన్సిటివ్ గ్రామాలు, 166 హ్యాబిటేషన్లలో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 144 తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పెన్నానది పరీవాహక మండలాలైన అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం పరిధిలోని గ్రామాల్లో వరద నీరు కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు కలెక్టరేట్ 0861–2331261, 79955 76699, కందుకూరు సబ్‌కలెక్టర్ 76010 02776, నెల్లూరు ఆర్డీఓ 98499 04061, ఆత్మకూరు ఆర్డీఓ 91009 48215, కావలి ఆర్డీఓ 77022 67559లకు ప్రజలు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, సెల్ ఫోన్ సిగ్నల్స్‌కు అంతరాయం లేకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌ను ప్రత్యేకాధికారి యువరాజ్ కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి తనిఖీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
మెంథా తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అధికంగా పొదలకూరు మండలంలో 18.8 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. ముత్తుకూరు 14.6, తోటపల్లిగూడూరు 13.6, ఇందుకూరుపేట 11.2, మనుబోలు 10.2 వర్షం కురిసింది. నెల్లూరు నగరంతో పాటు మిగతా అన్ని మండలాల్లో 10 మి.మీ.లోపు వర్షం నమోదైంది.
మైపాడు తీరంలో భద్రపరిచిన పడవలు, వలలు
ఐదో నంబర్
ప్రమాద హెచ్చరిక
నెల్లూరు(అర్బన్): మెంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో మంగళవారం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్‌వాడీ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు విధిగా తమ ఉత్తర్వులను అమలు చేయాలని సూచించారు.
ముత్తుకూరు (పొదలకూరు): కృష్ణపట్నం పోర్టులో అధికారులు సోమవారం ఐదో నంబర్ ప్రమాదకర హెచ్చరికను ఎగుర వేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పారు. తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నేడూ విద్యాసంస్థలకు సెలవు


