జలాశయానికి వరద తగ్గుముఖం
● 8, 9 క్రస్ట్‌గేట్ల నుంచి
నీటి విడుదల నిలిపివేత
సోమశిల: సోమశిల జలాశయానికి నాలుగు రోజులుగా పోటెత్తిన వరద సోమవారానికి తగ్గుముఖం పట్టడంతో 8, 9 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని నిలివేసామన్నారు. ప్రస్తుతం 29,571 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ క్రమంలో పెన్నానదికి 6,7 క్రస్ట్‌గేట్ల ద్వారా 32,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జలాశయంలో 67.101 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పునరావాస కేంద్రాల్లో
సౌకర్యాలు కల్పించాలి
● టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్
నెల్లూరు (అర్బన్): తుఫాను ప్రభావం నేపథ్యంలో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ తన బంగ్లా నుంచి ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, మండల ప్రత్యేకాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏ మాత్రం నీరు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అక్కడ భోజనం, తాగునీరు, బెడ్స్ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే నేరుగా తనకే ఫోన్ చేసి సమాచార మివ్వాలన్నారు. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ చెరువులు, ప్రాజెక్ట్‌ల వద్ద నిరంతర గస్తీ ఉండేలా చూడాలన్నారు. వర్షాల వల్ల కూరగాయలు, పాలు, తాగునీరు, సరుకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, కందుకూరు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
క్రీడా పోటీలు,
ఎంపికలు వాయిదా
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఈ నెల 29 నుంచి జరగాల్సిన సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు, ఎంపికలను మోంథా తుఫాను కారణంగా ఎంపికలను వాయిదా వేసినటు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్‌కే యతిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సమాచారం అందిన తర్వాత తెలియజేస్తామన్నారు.
అంత్యక్రియలకు వెళ్లి
వస్తుండగా..
● కల్వర్టును ఢీకొన్న కారు..
ఐదుగురికి గాయాలు
● మహిళ పరిస్థితి విషమం
జలదంకి (కలిగిరి): కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నలుగురి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల సమాచారం మేరకు.. వింజమూరు మండలం గోళ్లవారిపాళెంలో గోళ్ల రమేష్, అనూష, శశాంక్, మన్విత అంత్యక్రియలు సోమవారం జరి గాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన బంధువులు ఆదివారం వచ్చారు. తిరిగి వారు కారులో వెళ్తుండగా జలదంకి మండలం చిన్నక్రాక సమీపంలో కారు టైరు పంక్చర్ కావడంతో కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణ, కృష్ణచైతన్య, మోనిక, మరో మహిళ స్వల్పంగా గాయపడగా, సుమలత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపా రు. బాధితులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జలదంకి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జలాశయానికి వరద తగ్గుముఖం


