ఎక్కడి బస్సులు అక్కడే | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి బస్సులు అక్కడే

Oct 27 2025 8:46 AM | Updated on Oct 27 2025 8:46 AM

ఎక్కడ

ఎక్కడి బస్సులు అక్కడే

కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు బైక్‌ను ఢీకొని ఈడ్చుకుని పోవడంతో రాపిడికి పెట్రోల్‌ కారి మంటలు చెలరేగాయి. ఎక్కడైతే మంటలు చెలరేగాయో.. అక్కడే లగేజీ స్థలంలో 40కు పైగా సెల్‌ఫోన్లు కలిగిన పార్సిల్‌ బాక్సుతోపాటు గ్యాస్‌ సిలిండర్‌ ఉండడంతో మంటల తీవ్రత పెరిగి బస్సును వేగంగా చుట్టు ముట్టాయి. దీంతో బస్సు నుంచి సురక్షితంగా బయట పడేందుకు ఎక్కువ మందికి అవకాశం లేకుండా పోయింది. అదే సెల్‌ఫోన్‌ పార్సి ల్‌ బాక్స్‌, సిలిండర్‌ లేకుంటే మంటలు స్వల్ప స్థాయిలోనే ఉంటాయి.

జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని రాంచీ–లోహాగా జాతీయ రహదారిపై మందార్‌ బజార్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఓ ట్రావెల్స్‌ బస్సు కర్నూలు వద్ద జరిగిన తరహాలోనే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఆ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు అంటుకోగానే డ్రైవర్‌ బస్సును ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసి అందరిని కిందకు దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తుండగా అవి హఠాత్తుగా మండి బ్యాటరీ బాక్స్‌ సమీపంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవల నెల్లూరు సమీపంలో విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సును ఎకై ్సజ్‌ అధికారులు ఆపి తనిఖీ చేయగా భారీగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు.

బస్సు టాప్‌పై గూడ్స్‌ను రవాణా చేస్తున్న దృశ్యం

నెల్లూరు (టౌన్‌): ఓల్వో, బెంజ్‌, స్కానియా వంటి కంపెనీలు స్లీపర్‌ బస్సులు కేవలం 36 నుంచి 55 మంది ప్రయాణికులు భద్రంగా ప్రయాణించేందుకు అనుగుణంగా అత్యాధునికంగా తయారు చేస్తున్నారు. అయితే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు దురాశతో కంపెనీల నుంచి వచ్చిన బస్సులను నిబంధనలకు విరుద్ధంగా సీట్లు, బెర్తు లు, బాడీ బిల్డింగ్‌ను ఇష్టారీతిన గూడ్స్‌ రవాణాకు అనుగుణంగా డిజైన్‌ను మార్చేస్తున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు లేక పోవడంతో జిల్లాలో ఉండే రవాణా అధికారులు సైతం నిబంధనల అతిక్రమణపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గూడ్స్‌ రవాణాను ఆదాయవనరుగా..

ప్రయాణికుల నుంచి వచ్చే టికెట్‌ చార్జీల కంటే గూడ్స్‌ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. భద్రతా ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా సరుకులను రవాణా చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్లు తక్కువగా ఉన్నా.. గూడ్స్‌ రవాణా ద్వారానే రెట్టింపు స్థాయిలో అనధికారికంగా రాబడిని పొందుతున్నారని సమాచారం. నెల్లూరు నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా దాదాపు 120 ట్రావెల్స్‌ బస్సులు ప్రతి రోజు తిరుగుతున్నాయి. ఈ ట్రావెల్స్‌ బస్సుల్లో భారీగా గూడ్స్‌ రవాణా చేస్తున్నారు. ప్రయాణికుల బరువుకు అనుగుణంగా రూపొందించిన బస్సుల్లో అందుకు పది రెట్లు బరువు ఉండే సరుకులు రవాణా చేస్తున్నారు.

ట్యాక్స్‌లు ఎగ్గొట్టే సరుకుల రవాణా

ప్రధానంగా బెంగళూరు, చైన్నె, హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాలకు ప్రమాదకరమైన వస్తువులు, నిషేధిత మెటీరియల్స్‌తోపాటు ట్యాక్స్‌లు ఎగ్గొట్టే సరుకులను కూడా రవాణా చేస్తున్నారు. గార్మెంట్స్‌, పూలు, బొకేలు, ఫ్లైవుడ్‌, ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, బంగారం, వెండి, మత్తు, పేలుడు పదార్థాలు తదితరాలు భారీగా రవాణా అవుతున్నాయి. వీటితోపాటు బైక్‌లు, గ్యాస్‌ సిలిండర్లు సైతం రవాణా చేస్తున్నారు. బస్సు కింద భాగం, పైభాగాన్ని మొత్తం గూడ్స్‌తో నింపేస్తారు. వీటిల్లో చాలా వరకు వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా అవుతున్నట్లు తెలిసింది. సరుకు రవాణాకు ప్రత్యేకించి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు ఉన్నా వ్యాపారులు ట్యాక్స్‌ లు చెల్లించకుండా ఉండేందుకు అక్రమ మార్గంలో సరుకులు, వస్తువులు రవాణాకు ట్రావెల్స్‌ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సుల్లో అయితే ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుతుండడంతో ఈ అక్రమ మార్గాన్ని వ్యాపారులు ఎంచుకుంటే.. దురాశతో బస్సుల యాజమాన్యాలు వ్యాపారులతో ఒప్పందాలు కదుర్చుకుని భారీ స్థాయిలో గూడ్స్‌ను రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. బస్సులో ఎక్కిన ప్రయాణికుడు రెండు.. మూడు బ్యాగ్‌లు తీసుకువస్తే ఒక బ్యాగుకు అదనంగా చెల్లించా లని డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి ఉంది.

ప్రాణాలతో చెలగాటం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు ధనాశతో బరితెగిస్తే.. నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు అవినీతి మత్తులో పేరాశతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. యాజమాన్యాలతోపాటు అధికారులు కలిసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ట్రావెల్స్‌ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్‌ క్యారియర్లుగా, సరుకుల రవాణా వాహనాలుగా తిప్పుతున్నా.. అధికారులు చూసీచూడకుండా వ్యవహరించడం వల్లే ప్రజల ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలోని కర్నూలు, జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ వద్ద జరిగిన ట్రావెల్స్‌ బస్సుల దగ్ధం ఘటనలకు కారణాలు ఒకటేగా ఉన్నాయి. ప్రమాదకరమైన వస్తువులు, రసాయనాల తరలింపు వల్లే ఈ ఘటనల తీవ్రతకు కారణంగా చెప్పొచ్చు. జిల్లా నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించే ట్రావెల్స్‌ బస్సుల్లో భారీ స్థాయిలో గూడ్స్‌ రవాణా చేస్తున్నారు. ఇందు కోసం ప్రయాణికుల లగేజీలపై నియంత్రణ విధిస్తున్నారు. వీటికి కూడా అదనంగా వసూలు చేస్తున్నారు.

ట్రావెల్స్‌ బస్సుల్లో డిజైన్‌ మార్పు

ప్రయాణికుల బరువుకు మించి గూడ్స్‌ రవాణా

దీనికి తోడు మితిమీరిన వేగం

అధిక బరువు, వేగంతో కంట్రోల్‌ తప్పుతున్న వైనం

బిల్లుల్లేని బేళ్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ప్రమాదకరమైన రసాయనాల రవాణా

గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కూడా..

ప్రయాణికుల లగేజీ బ్యాగ్‌లకు అదనపు వసూళ్లు

తనిఖీలు చేపట్టని రవాణా, వాణిజ్య పన్నుల శాఖలు, పోలీసు అధికారులు

మొక్కుబడి తనిఖీలకే పరిమితం

ట్రావెల్స్‌ బస్సులను ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖాధికారులు తనిఖీలతో హడావుడి చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు పరిస్థితి సర్దుమణిగాక తిరిగి యథావిథిగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్‌ బస్సుల్లో భారీగా గూడ్స్‌ రవాణా చేస్తున్నా.. రవాణాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీసు అధికారులు ఎవరూ పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బస్సుల్లో రవాణా చేస్తున్న ఆయా వస్తువులకు ఎలాంటి బిల్లులు ఉండవు. కాని ఎప్పుడూ వాణిజ్య పన్నుల శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన సందర్భాలు లేవు. బస్సుల్లో గూడ్స్‌ని తనిఖీ చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని అని తెలిసినా నెల మామూళ్లతో అన్ని శాఖల అధికారులు ఎప్పుడూ ట్రావెల్స్‌ బస్సులు తనిఖీల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్‌ బస్సులను రవాణా అధికారులు తనిఖీ చేసినా ఏదో టార్గెట్ల కోసం మొక్కుబడిగా కేసుల నమోదు చేసి వదిలివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించినా, పెద్ద మొత్తంలో లగేజీని రవాణా చేసినా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు లేనిదే తామేమి చేయలేమని చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన ట్రావెల్స్‌ బస్సులను కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులే స్పష్టమైన ఆదేశాలు చేయాలంటున్నారు. ఒక వేళ బస్సును సీజ్‌ చేసినా ఉన్నతాధికారులు కల్పించుకునే వెంటనే పంపించేయాలని చెబుతున్న పరిస్థితి ఉందంటున్నారు.

జిల్లాలో ట్రావెల్స్‌ బస్సులపై రవాణా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో రెండు రోజులుగా బస్సులను నిలిపివేశారు. తిరుగుతున్న ఎక్కువ బస్సులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ బస్సులను నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో నిలిపివేశారు. రెండు రోజుల నుంచి ట్రావెల్స్‌ బస్సులు రావడం కూడా తగ్గిందని రవాణా అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో గూడ్స్‌ రవాణా చేస్తే కఠిన చర్యలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ తప్ప ఎలాంటి వస్తువులు, ప్రమాదకర, నిషేధిత వస్తువులే కాదు.. ఎలాంటి గూడ్స్‌ తీసుకెళ్లకూడదు. బస్సుల్లో తీసుకెళుతున్న గూడ్స్‌ రవాణాపై గతేడాది 187 కేసులు నమోదు చేశాం. ఈ ఏడాది ట్రావెల్స్‌ బస్సులపై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ నిబంధనలు పాటించని ట్రావెల్స్‌ బస్సులపై తనిఖీలు చేసి వాటిపై భారీగా కేసులు నమోదు చేస్తాం. రానున్న రోజుల్లో ట్రావెల్స్‌ బస్సులపై బృందాలు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం.

– బి.చందర్‌, డీటీసీ

ఎక్కడి బస్సులు అక్కడే 1
1/3

ఎక్కడి బస్సులు అక్కడే

ఎక్కడి బస్సులు అక్కడే 2
2/3

ఎక్కడి బస్సులు అక్కడే

ఎక్కడి బస్సులు అక్కడే 3
3/3

ఎక్కడి బస్సులు అక్కడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement