వణికిస్తున్న మోంథా తుపాను | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న మోంథా తుపాను

Oct 27 2025 8:46 AM | Updated on Oct 27 2025 8:46 AM

వణికిస్తున్న మోంథా తుపాను

వణికిస్తున్న మోంథా తుపాను

నెల్లూరు (అర్బన్‌): గత వారంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగాయి. ఎక్కువ భాగం చెరువులు నిండి కలుజులు పారాయి. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగిపోలేదు. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మోంథా తుపాన్‌గా బలపడుతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లాలో సోమవారం నుంచే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

144 రిలీఫ్‌ కేంద్రాల ఏర్పాటు

తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులతోపాటు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. తుపాన్‌ నేపథ్యంలో ఆర్డీఓలు, స్పెషలాఫీసర్లతో కలెక్టర్‌ ఆదివారం ఫోన్‌ ద్వారా మాట్లాడారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి, మండల ప్రత్యేకాధికారులకు సెలవులు రద్దు చేశారు. పోలీసులు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 144 రిలీఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెన్నానది పరీవాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, కలువాయి, సంగం తదితర మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో కరకట్టకు తాత్కాలిక మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 27 ప్రదేశాలు, రైల్వే మార్గాల్లో 16 ప్రదేశాలు వరదలకు లోనయ్యే అవకాశం ఉందని గుర్తించి ఆయా ప్రాంతాలను 377 చౌకదుకాణాలతో అనుసంధానించి పీడీఎస్‌ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను సిద్ధం చేశారు.

● వారంలోపు ప్రసవించే 312 మంది గర్భిణులను గుర్తించి వారికి రవాణా సౌకర్యంతోపాటు ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

● వరద ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచేలా 82 డీసెంట్రలైజ్డ్‌ రైతు బజార్లు సిద్ధం చేశారు. విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే 35 సీపీఎస్‌డబ్ల్యూఎస్‌లకు విద్యుత్‌ సరఫర ఇబ్బంది లేకుండా బ్యాకప్‌ పవర్‌ ఏర్పాటు చేశారు.

● వరద ప్రభావిత ప్రాంతాల్లో 40 వేల నీటి క్యాన్లు సేకరించి అందుబాటులో ఉంచారు.

● బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలతో సమావేశం నిర్వహించి 2100 చోట్ల మొబైల్‌ టవర్స్‌కు పవర్‌ బ్యాకప్‌ ఏర్పాటు చేశారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధం

వరద ప్రభావం ఎక్కువైతే ప్రజలను ఆదుకుని ఒడ్డుకు చేర్చుకునేందుకు నెల్లూరులో ఒక ఎన్‌డీఆర్‌ఆఫ్‌ , కావలిలో ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు.

తీరంలో ఎగసి పడుతున్న అలలు

జిల్లాలోని మైపాడు, కొత్తకోడూ రు, రామతీర్థం, రామాయపట్నం, కృష్ణపట్నం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం కస రుగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం 5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. బకింగ్‌హామ్‌ కెనాల్‌కు ప్ర వాహం పెరిగింది. ఇప్పటికే ఈ దురుగాలులు మొదలయ్యాయి. దీంతో పర్యాటకులు బీచ్‌ల వద్దకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు గస్తీ కాస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు.

పెన్నాకు పెరిగిన ప్రవాహం

ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో సోమశిల ప్రాజెక్ట్‌ అధికారులు వరద నీటిని పెన్నాకు వదిలారు. నీటితో పాటు బొగ్గేరు, బీరాపేరు ఉపనదుల నుంచి వచ్చిన వర్షపు నీరు కలిసి నదిలో సుమారు లక్ష క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్‌ అధికారులు ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో పరిశీలిస్తూ నీటిని నియంత్రిస్తున్నారు. వర్షాలు పెరిగితే ఏ క్షణమైనా వరద నీటిని సోమశిల నుంచి భారీ స్థాయిలో నదిలోకి వదిలే అవకాశం ఉంది.

పీజీఆర్‌ఎస్‌ రద్దు

తుపాన్‌ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను కలెక్టర్‌ రద్దు చేశారు. ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తోపాటు ముందస్తుగా డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూం: 0861–2331261, 7995576699

కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం: 7601002776

నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం: 9849904061

ఆత్మకూరు ఆరీడ్‌ఓ కార్యాలయం: 9100948215

కావలి ఆర్డీఓ కార్యాలయం: 7702267559

జిల్లాకు భారీ వర్ష సూచన

ఇప్పటికే పొంగుతున్న వాగులు, వంకలు

భయం గుప్పెట్లో పెన్నా పరీవాహక గ్రామాలు

అధికారులకు సెలవుల రద్దు

తీరంలో ఎగసి పడుతున్న అలలు

బీచ్‌ల వైపు వెళ్లకుండా పోలీసుల గస్తీ

144 రిలీఫ్‌ కేంద్రాల ఏర్పాటు

తుపాన్‌ ఎదుర్కొనేందుకు

సిద్ధంగా ఉండాలి: కలెక్టర్‌

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement