ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు
కోవూరు: కర్నూలు సమీపంలో జరిగిన బస్సు దగ్ధం ఘటన తర్వాత జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డీటీసీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కోవూరు, కావలి వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిట్‌నెస్, ఇన్సురెన్స్ లేకపోవడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించి కావలిలో 7, కోవూరు వద్ద 6 బస్సులు సీజ్ చేశారు. వీటిని కావలి, నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లకు తరలించారు. కావలిలో ఎంవీఐలు కరుణాకర్, ఆయన సిబ్బంది, కోవూరు వద్ద ఎంవీఐ బాలమురళి, ఏఎంవీఐలు స్వప్నిల్ రెడ్డి, రఫి, రఘువర్ధన్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


