సోమిరెడ్డీ... నోరు అదుపులో పెట్టుకో
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నువ్వు, నీ పార్టీ అధినేతలు కాలి గోటికి కూడా సరిపోరని, సోమిరెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య స్థితి గురించి మాట్లాడే ముందు సోమిరెడ్డి తన శారీరక స్థితిని చూసుకోవాలన్నారు. డేటా సెంటర్, డెవలప్‌మెంట్ సెంటర్ గురించి సోమిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని, పదో తరగతి కూడా పాస్ కాని సోమిరెడ్డికి డేటా సెంటర్‌కు, డెవలప్‌మెంట్ సెంటర్‌కు తేడా తెలుసా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి సర్వేపల్లిలో మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద అక్రమ రవాణాతో పాటు, ఇరిగేషన్‌లో దొంగ బిల్లులు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. సోమిరెడ్డి అక్రమ సంపాదన గురించి తెలిసి, చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడ లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ దగ్గర మార్కుల కోసం పాకులాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి గురించి స్థాయికి మించి మాట్లాడుతున్నాడన్నారు. సిటీ సెంటర్లు, లిక్కర్ షాపులు, లిక్కర్ బ్రాండ్ల గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డిదని, లెక్కా, పక్కాలో సోమిరెడ్డి మొనగాడన్నారు. సోమిరెడ్డి దేవదాయ భూములు, రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. సోమిరెడ్డి శక్తికి మించి మాట్లాడితే ప్రజలే ఛీకొట్టే పరిస్థితులు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలన్నారు.


