
కొండలు కరిగించి.. గ్రావెల్ దోచేసి
టీడీపీ నేతలు ధనదాహంతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. గ్రామానికి సహజ సౌందర్యంగా ఉండే కొండలను గ్రావెల్ కోసం అనుమతుల్లేకుండా అక్రమంగా తవ్వేస్తున్నారు. పశువులకు మేతపోరంబోకు భూముల్లో గ్రావెల్ కొల్లగొట్టి రూ.కోట్లు మింగుతున్నారు. టీడీపీ నేతలు దాష్టీకంతో పశువులకు మేతలేకుండా పోతుందని పాడిరైతులు ఆందోళన చెందుతుంటే.. భారీ గోతుల్లో తమ పిల్లలకు ఎక్కడా ప్రాణాపాయం తలెత్తుతుందోనని ఆ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు కన్నెత్తి చూడకపోవడంపై, ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యర్రబల్లి తిప్ప కింద ఏర్పడిన గ్రావెల్ గోతులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల కడుపులే కాదు.. చివరకు పశువుల కడుపులు కొడుతున్నారు. పశువుల మేతపోరంబోకు భూమిగా ఉండే యర్రబల్లి కొండను కొల్లగొడుతున్నారు. పొదలకూరు మండలం యర్రబల్లికే మణిహారంగా, ప్రకృతి సౌందర్యంగా ఉండే సహజ కొండ కింద భూముల్లో గ్రావెల్‌ను తవ్వి జేబులు నింపుకొంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత అండతో ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే స్థానికులను పోలీసులతో బెదిరించి అడ్డూ అదుపు లేకుండా గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా రాత్రి, పగలు తేడా లేకుండా కొండ కింద గ్రావెల్‌ను తరలించి గోతులను మిగుల్చుతున్నారు. పశువులు మేత మేసేందుకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆయా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారమే అండగా చెలరేగిపోతున్నా గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక్కడి గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల గ్రామానికి చెందిన అధికార పార్టీకు చెందిన నేతలే అక్రమ గ్రావెల్ తరలించేందుకు వీల్లేదని టిప్పర్లను అడ్డుకున్నారు. వర్షం వల్ల ప్రస్తుతం అక్రమ గ్రావెల్‌ను తరలించడం నిలిపివేసిన అక్రమార్కులు తిరిగి తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అనుమతులు లేకుండా తరలింపు
యర్రబల్లి తిప్ప కింద నుంచి జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్లలో రాత్రి వేళ తరలిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఉదయం 6 గంటల వరకు గ్రావెల్ తరలింపు జరుగుతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేశారు. అక్రమంగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకోవడంతో ఏర్పడిన గోతుల్లో వర్షాకాలంలో నీరు చేరి పిల్లలు అటుగా వెళితే ప్రమాదాలు ఏర్పడతాయని నిలదీశారు. అయితే మధ్యాహ్నం వరకు టిప్పర్లను నిలిపిన వారిని పోలీసు కేసులు పెడతామని బెదిరించడంతో వారు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఎటువంటి అనుమతులు లేకుండా తమ గ్రామం నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించడమే కాక గ్రామస్తులపైనే కేసులు పెట్టిస్తామని బెదిరించడం ఎంతవరకు సబబని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు మైనింగ్ అధికారులు స్పందించి కొండ విధ్వంసాన్ని అడ్డుకోవాలని స్థానికులులు కోరుతున్నారు.
అనుమతుల్లేకుండా తవ్వకాలు
ప్రమాదకర స్థాయిలో భారీ గోతులు
రూ.కోట్లు మింగుతున్న టీడీపీ నేతలు
పశువులకు మేత లేకుండా పోతుందని
రైతుల ఆందోళన

కొండలు కరిగించి.. గ్రావెల్ దోచేసి