
వినతులిచ్చినా పట్టించుకోలేదు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
సోమశిల: అనంతసాగరం మండలం సంజీవనగరం గ్రామానికి చెందిన గంగు నారాయణ, అతని తమ్ముడు ఎర్రగంగు, కుటుంబ సభ్యులు బుధవారం అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం తమకు జగనన్న లేఅవుట్‌లో 20వ నంబర్ ప్లాట్‌ను కేటాయించిందన్నారు. తమ ప్లాట్ నంబర్‌తో ఫాతిమా అనే మహిళకు అధికారులు పట్టా ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలో వినతులిచ్చినా పట్టించుకోలేదన్నారు. దీనిపై తహసీల్దార్ జయవర్ధన్ మాట్లాడుతూ సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందన్నారు. హౌసింగ్‌లో ఇద్దరి లబ్ధిదారుల పేర్లు నమోదైనట్లు చెప్పారు. ఫాతిమా కుటుంబం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నందున నారాయణ ఒప్పుకొంటే మరో ప్లాట్‌ను ఇస్తామన్నారు.