
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మనుబోలు: ఓ విద్యార్థి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని జట్ల కొండూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జట్ల కొండూరు దళితవాడకు చెందిన కసుమూరు రాఘవయ్య, ప్రమీలమ్మ దంపతుల కుమారుడు కసుమూరు రమేష్ (19) కాకినాడ సమీపంలోని సూరాయపాళెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గతేడాది రెండో సంవత్సరం మధ్యలో ఆపేసి అక్కడ ఉండలేనంటూ జట్ల కొండూరుకు వచ్చేశాడు. ఆపై మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి పరీక్షలు రాసేందుకు ప్రయత్నించగా సాంకేతిక కారణాలతో వీలుకాదని అధ్యాపకులు తెలిపారు. మళ్లీ వెళ్లి సూరాయపాళెంలో ఫీజు కట్టి హాల్‌టికెట్ వచ్చినా పరీక్షలు రాయలేదు. దీంతో అతను తీవ్ర మానసికవేదనతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం వెతకగా కాగితాలపూరు సమీపంలోని జామాయిల్ తోటలోని వేపచెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివ రాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.