
గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
● రూ.2 లక్షల ఆస్తి నష్టం
పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామంలో బుధవారం వంట గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి పూరిల్లు దగ్ధమైంది. మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక అధికారులు ఆర్పివేశారు. వివరాలు.. కొండమ్మ పూరింట్లో నివాసముంటున్నారు. ఆమె గ్యాస్ స్టౌ అంటించి సక్రమంగా ఆర్పలేదు. గ్యాస్ లీకై మండుకుని సిలిండర్ పేలింది. ఆ సమయంలో కొండమ్మ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని చెబుతున్నారు. బాధితురాలు కట్టుబట్టలతో మిగిలినట్టు కన్నీంటి పర్యంతమైంది. పొదలకూరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.