
ప్రయాణికులకు నరకం
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. సభలంటే చాలు ఆర్టీసీ బస్సుల్ని తరలించేస్తున్నారు. దీంతో బస్టాండ్లలో జనం ఎదురుచూపుల్లో ఉండిపోతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎవరైనా వినియోగించాలంటే అద్దె తప్పనిసరిగా ముందుగా చెల్లించాలి. అయితే కూటమి పెద్దలు ఆర్టీసీని తమ సొంత సంస్థగా భావించి బస్సులను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అద్దె చెల్లింపులు బకాయిలు పెట్టడంతో ఆ ర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
పెద్ద సంఖ్యలో..
జిల్లాలో మొత్తం 7 డిపోలున్నాయి. నెల్లూరు 1 డిపో, 2 డిపో, ఆత్మకూరు, కందుకూరు, కావలి, రాపూరు, ఉదయగిరి డిపోలున్నాయి. అన్నింట్లో 642 బస్సులున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించే సభలకు పెద్ద సంఖ్యలో వాహనాలను తరలిస్తున్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు కూటమి ప్రభుత్వం వివిధ సభలకు బస్సులను తీసుకెళ్లింది. అందులో మహానాడు సభకు మాత్రమే నగదు చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటికి సంబంధించి నగదు చెల్లింపులపై స్పందన లేదు.
ప్రైవేట్ వాహనాలే దిక్కు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలో జరిగే జీఎస్టీ.. సూపర్ సేవింగ్ సభలో ప్రధాని పాల్గొంటారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బుధవారం 250 బస్సులను తరలించారు. దీంతో ఆర్టీసీ డిపోల్లో స్వల్ప సంఖ్యలో బస్సులు కనిపించాయి. గ్రామాల నుంచి నెల్లూరుకు, నగరం నుంచి పట్టణాలు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అడపాదడపా వచ్చే బస్సుల కోసం గంటల తరబడి డిపోల్లో వేచిచూడాల్సి వచ్చింది. వచ్చిన వాటిని ఎక్కేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓవైపు వర్షం, మరోవైపు ఊర్లకు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించారు. దూర ప్రాంతవాసులు రెండు, మూడు ఆటోలు మారి గమ్యస్థానం చేరుకోవాల్సి వచ్చింది.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ఈ ఏడాది మే 4వ తేదీన అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు జిల్లా నుంచి 290 బస్సులను తరలించారు. మే 30వ తేదీన కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు 263 బస్సులను, సెప్టెంబర్ 10వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్‌హిట్ బహిరంగ సభకు 260 బస్సులను తీసుకెళ్లారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగే సభకు 250 బస్సులు పంపారు. కూటమి ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందంటే ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభ నిర్వహించే ముందురోజు, ఆరోజు ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండాల్సిందే. విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సిన స్థితి వచ్చింది.
జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు బస్సుల తరలింపు
అవస్థలు పడుతున్న జనం
కూటమి ప్రభుత్వంలో ఇది మామూలే..
నాలుగు పర్యాయాలు సభలకు
బస్సుల వినియోగం
ఇప్పటికి ఒక్కదానికే అద్దె చెల్లింపు

ప్రయాణికులకు నరకం