
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల ‘పవర్’
● సమ్మెలో 8 వేల మంది
ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు
● అర్ధరాత్రి వరకు చర్చలు..
ఆఖరివరకు సస్పెన్స్
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతుండడంతో తమ ‘పవర్’ ఏమిటో చూపించేందుకు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయెజనం లేకపోవడంతో నెల రోజుల నుంచి దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు, నిరసనలను పట్టించుకోక పోవడంతో బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు జేఏసీ పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ పెద్దలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. జిల్లాలో ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కం, ఏపీ జెన్‌కోల్లో 8 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో ఉన్న రెండు యూనియన్లు మినహా దాదాపు అన్ని యూనియన్లు, అసోసియేషన్లు సమ్మెకు సిద్ధపడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె లోకి వెళ్లనున్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న లైన్‌మన్లు, అసిస్టెంట్ లైన్‌మన్లు, జూనియర్ లైన్‌మన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, షిప్టు ఆపరేటర్లు సమ్మెలో పాల్గొంటే ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్పవనే చెప్పాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో మరమ్మతు పనులు చేసేవారు లేక, విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహించే వారు లేకపోవడంతో దీని ప్రభావం నేరుగా విద్యుత్ వినియోగదారులు, ప్రజలపై పడే అవకాశం ఉంది. అయితే విజయవాడలోని విద్యుత్‌సౌదలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో మంగళవారం సాయంత్రం పలు యూనియన్ల నాయకులు చర్చలకు హాజరయ్యారు. ఈ చర్చలు విఫలమైతే బుధవారం నుంచి సమ్మె తప్పదు.
విద్యుత్ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే
● విద్యుత్ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.
● పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
● ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్హత కలిగిన జూనియర్ ఇంజినీర్లను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పించాలి.
● విద్యుత్ సంస్థలో కారుణ్య నియమాకాలను పాత పద్ధతిలో చేపట్టాలి.
● 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను కాంట్రాక్ట్‌కు ఇవ్వకుండా విద్యుత్ యాజమాన్యాలే నిర్వహించాలి.
● జూనియర్ లైన్‌మన్ గ్రేడ్–2లను అసిస్టెంట్ లైన్‌మన్లుగా పదోన్నతి కల్పించాలి.
● విద్యుత్ ఉద్యోగులు, పింఛనర్లకు అపరిమిత నగదు రహిత వైద్య సౌకర్యం అందించాలి.