
అసమర్థ, అబద్ధాల పాలకులు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఈ రాష్ట్రంలో అసమర్థ, అబద్ధాల పాలకులు రాజ్యమేలుతున్నారని, మెడికల్ కళాశాలల విషయంలో ఇది ప్రస్ఫుటం అవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ర్డెడి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. తొలిరోజు ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నా రు. ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తులను కొల్ల గొట్టే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి తీసుకుని వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్య దూరం కావడంతోపాటు, పేదల కోసం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోవన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మెడికల్ కళాశాలకు సంబంధించి అబద్ధాలు మాట్లాడడం దారుణమని, జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాల వద్ద కూటమి నేతలు మాట్లాడే అబద్ధాలను ప్రజలకు తెలిసేలా చేశారన్నారు. కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఒప్పుకోకుండా, జగన్‌మోహన్ రెడ్డిపై నిందలు వేస్తున్నారన్నారు. ఆయన తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ, సొమ్ము చేసుకోవడం దుర్మార్గమన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 42 రోజుల పాటు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామన్నారు. అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి 60 వేల సంతకాల సేకరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నవంబర్ 26వ తేదీ సేకరించిన కోటి సంతకాలను జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌కు వినతి పత్రంగా అందజేస్తామన్నారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం
కోటి సంతకాల ఉద్యమంతో కూటమిని కూకటి వేళ్లతో సహా పెకలిస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి