
సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలు
వరికుంటపాడు: చంద్రబాబు చెప్పిన పథకాలు కొన్ని అరకొర మందికి అందితే.. మరి కొన్ని అమలే చేయకుండా.. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకోవడానికి సిగ్గు లేదా? అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలపై ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తెలియజేయాలని కోరారు. శుక్రవారం వరికుంటపాడు మండలం ఇరువురులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నిన్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను జూన్ 2024 నుంచి అమలు చేస్తానని మొదటి ఏడాది ఎగ్గొట్టారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద చంద్రబాబు రైతులకు శఠగోపం పెట్టారన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకంగా రూ.15 వేలు ఇస్తానని అరకొరగా నిధులు జమ చేశాడన్నారు. నిరుద్యోగ భతి, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాల ఊసేలేకుండా మంగళం పాడేశారన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేశారన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపుతున్నారన్నారు. చంద్రబాబు కాపీ కొట్టడం తప్ప, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సొంత ఆలోచన ఉండదని, జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి, అంతా తన గొప్పేనంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని, దేశ చరిత్రలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు రూ.కోట్ల విలువ చేసే భూములను ఎకరా వంద రూపాయలకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆరోపించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి నేతలు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అనుచరులే కల్తీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారులుగా నిలిచారని, వీరి అండదండలు లేకపోతే చంద్రబాబు సొంత జిల్లాలో కల్తీ మద్యాన్ని స్వేచ్ఛగా తయారు చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీపై మీకున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను మా భుజాలపై మోసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ యువనాయకులు మేకపాటి అభినవ్‌రెడ్డి, జెడ్పీటీసీలు, గణపం బాలకృష్ణారెడ్డి, మేదరమెట్ల శివ లీల, చెరుకుపల్లి రమణారెడ్డి, మోడీ రామాంజనేయులు, అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి
17 నెలల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి