
ప్రయాణం.. నరకప్రాయం
● అల్లూరు రోడ్డుపై ఇదీ పరిస్థితి
● కొంతమేర వేసి వదిలేసిన వైనం
కొడవలూరు: అల్లూరు రోడ్డు ప్రయాణికులకు నరకం చూపుతోంది. కొడవలూరు నుంచి అల్లూరు వెళ్లే రోడ్డుకు ఎంతో ప్రాధాన్యముంది. దీని మీదుగానే విడవలూరు, రామతీర్థం, అల్లూరుకు వెళ్లాల్సి ఉంది. మండల పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఇటీవల నిర్మాణం చేశారు. కానీ కొడవలూరు నుంచి గుండాలమ్మపాళెం వరకూ ఒక కిలోమీటర్ మేర వదిలేశారు. అక్కడి నుంచి పద్మనాభసత్రం వరకూ వేశారు. పద్మనాభసత్రం నుంచి తలమంచి రోడ్డు వరకూ వేయలేదు. ఇరువైపులా కిలోమీటర్ వంతున రోడ్డు వేయకపోవడం వల్ల పెద్దగా ప్రయాజనం కనిపించడం లేదు. ఈ రెండు కిలోమీటర్ల రహదారి బాగా దెబ్బతిని గుంతలమయమై ఉంది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి. రాకపోకలు సాగించే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. నెల క్రితం ఓ వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పైగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డు మలుపులుగా ఉండటంతో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్డు బాగు పడుతుందని అందరూ భావించారు. కానీ పూర్తిగా వేయకుండా ఇరువైపులా వదిలేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

ప్రయాణం.. నరకప్రాయం