
పొదల్లో విగతజీవిగా..
● వృద్ధుడిని ఢీకొట్టిన కారు
● డ్రైవర్ నిద్రమత్తే కారణం
● సాయంత్రం గుర్తించే సరికి
ప్రాణాలు విడిచి..
దుత్తలూరు: కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు పొదల్లో పడ్డాడు. ఆయన్ను ఎవరూ గుర్తించలేదు. సాయంత్రం చూసేసరికి చనిపోయి ఉన్నాడు. ఈ ఘటన శుక్రవారం దుత్తలూరు పంచాయతీ చింతలగుంట సమీపంలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దుగ్గినబోయిన పెదబాల నరసింహులు (70) రహదారి పక్కన నడిచి వెళ్తున్నాడు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి పామూరు వైపు కారు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో నరసింహుల్ని ఢీకొట్టాడు. దీంతో కారు రోడ్డు మార్జిన్ దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు అక్కడికి చేరుకుని కారును ట్రాక్టర్‌తో బయటకు తీశారు. అయితే నరసింహులును కారు ఢీకొట్టిన విషయం ఎవరూ గమనించలేదు. సాయంత్రమైనా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనుమానం వచ్చి కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో చూడగా చెప్పులు కనిపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో చూశారు. పొదల్లో నరిసింహులు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు బయటకు తీయగా చనిపోయి ఉన్నాడు. గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.