
పేదింట ఉడకని కందిపప్పు
● సరఫరా చేయని కూటమి ప్రభుత్వం
● అంగన్‌వాడీలకే పంపిణీ
● మిగిలింది చౌక దుకాణాలకు..
● అక్కడి నుంచి నల్లబజారుకు తరలింపు
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదింట కందిపప్పు ఉండకడం లేదు. చౌక దుకాణాలకు సరఫరా చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కేజీ కందిపప్పు రూ.160 నుంచి రూ.170 వరకు ఉంది. పేదలు అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇటీవల దసరా పండగకు సైతం చంద్రబాబు సర్కారు పంపిణీ విషయాన్ని పట్టించుకోలేదు.
మిగిలింది మాత్రమే..
జిల్లాలో 7.21 లక్షల రేషన్ కార్డులున్నాయి. 1,513 చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారులకు కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం కందిపప్పు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో 5 నుంచి 10 టన్నులు మిగులుతోంది. ఇది చెడిపోతుందని అతి తక్కువ రేషన్ షాపులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.67కే విక్రయించాలి. కానీ బయట అధిక ధర ఉండటంతో డీలర్లు కార్డుదారులకు పంపిణీ చేయకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న అధిక ధరలకు పాలకులు కళ్లెం వేయడం లేదు.
నిరాశ చెందుతూ..
చౌక దుకాణాల్లో ఇచ్చే రేషన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేయలేదు. లబ్ధిదారులు ప్రతి నెలా చౌకదుకాణాలకు వెళ్లి కందిపప్పు అడిగి నిరాశ చెందుతున్నారు.
సరఫరా చేయడం లేదు
చౌకదుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా చేస్తున్నాం. కందిపప్పు పంపిణీ చేయడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నాం. వాటిలో మిగిలింది పురుగు పట్టకుండా అతి తక్కువ చౌకదుకాణాలకు పంపుతున్నాం. కందిపప్పును కార్డుదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– అర్జున్‌రావు,
పౌరసరఫరాల సంస్థ డీఎం