
పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే ఉపేక్షించం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల జోలికి వస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చవటపాళెంలో ఆదివారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణి స్థానికులతో కలిసి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయించి ఆ స్థలాలను అప్పనంగా టీడీపీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన పేదలకు చెందిన ఇళ్ల స్థలాల జోలికి వస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పేదలకు చెందిన ఇళ్ల స్థలాలను కబ్జా చేయాలని ఎవరు ప్రయత్నించినా క్షమించబోమన్నారు. అధికారులు అత్యుత్సాహంతో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకు నోటీసులు ఇస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించి పేదల పక్షాన పోరాడతామని తెలియజేశారు.
దోపిడీపైనే సోమిరెడ్డికి శ్రద్ధ
సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచుకోవడంపైనే సోమిరెడ్డి, అతని కుమారుడు రాజగోపాల్‌రెడ్డి శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లిలో గ్రావెల్, ఇసుక, మట్టి బూడిద మాఫియా రోజు రోజుకు పెరిగిపోతుందని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ పనులపై విచారణ జరిపితే సర్వేపల్లిలో జరిగిన దోపిడీ బట్టబయలవుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతాంగం అన్నీ విధాలా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని, పండించిన పంటకు గిట్టుబాటు లభించక రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలియజేశారు. నకిలీ మద్యం బారిన పడి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కూటమి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.