
అనర్హుడికి ‘ఆటోడ్రైవర్ల సేవలో’
● సొంత ఆటో లేకుండానే
టీడీపీ కార్యకర్తకు పథకం వర్తింపు
● ఆయన స్వతహాగా వ్యవసాయదారుడు
● అర్హులకు దక్కని వైనం
మర్రిపాడు: కూటమి ప్రభుత్వ పాలనలో పథకాలు అర్హత లేకపోయినా తమ్ముళ్లకే దక్కుతున్నాయనేందుకు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దర్పణంగా నిలుస్తోంది. జిల్లాలో సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లు సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ ఈ పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కొర్రీలు వేసి చివరకు 17,406 మందికి ఈ పథకాన్ని వర్తింప చేశారు. అనర్హుడైన పక్కా టీడీపీ కార్యకర్తకు ఏ విధంగా లబ్ధి చేకూర్చారో అధికారులే సెలవివ్వాల్సి ఉంది. నిరుపేద ఆటోడ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు అంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పినా.. అమల్లో మాత్రం రాజకీయ సిఫారసులకు ప్రాధాన్యత లభించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపాడు మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముప్పాళ్ల జయవర్ధన్‌కు అసలు ఆటోనే లేదు. అతను ఆటోడ్రైవర్ కూడా కాదు. జయవర్ధన్ వ్యవసాయం చేస్తుంటాడు. అయినా ‘ఆటోడ్రైవర్ల సేవలో’ లబ్ధిదారుడిగా ఎంపిక కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. జయవర్ధన్‌కు AP39 UX3918 నంబరుతో ఆటో ఉన్నట్లు లబ్ధిదారుల జాబితాలో చూపించారు. రవాణాశాఖ రికార్డుల ప్రకారం ఈ ఆటోకు మర్రిపాడు మండలం వెంగంపల్లి పంచాయతీలోని భీమవరం గ్రామానికి చెందిన గోవిందు కృష్ణారెడ్డి యజమానిగా ఉన్నారు. జయవర్ధన్ ఎవరిదో ఆటోలో కూర్చొని ఫొటో తీసుకుని ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దరఖాస్తుతో జతచేసి, ఆటోడ్రైవర్‌లా చూపించి పథకాన్ని పొందినట్లు తెలుస్తోంది. దీనిపై గ్రామస్తులు సైతం ఎంపీడీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన అర్హుడైన షేక్ అజామ్ అనే ఆటోడ్రైవర్‌కు లబ్ధి చేకూరలేదు. అర్హులైన ఆటోడ్రైవర్లకు చేకూరాల్సిన పథకాన్ని టీడీపీ నేతలు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందుతున్నారని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద అనర్హులు లబ్ధిపొంది ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. లబ్ధి చేకూరని అర్హులకు న్యాయం జరిగేలా మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. అర్హులందరికీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యేలా చూస్తాం.
– మనోహర్‌రాజ్, ఎంపీడీఓ, మర్రిపాడు

అనర్హుడికి ‘ఆటోడ్రైవర్ల సేవలో’