
ప్రైవేట్ ఆస్పత్రిలో చోరీ
● మహిళ బ్యాగ్‌లోని 10 సవర్ల
బంగారం అపహరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శ్రీనివాస అగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ బ్యాగ్‌లోని బంగారు ఆభరణాలు, నగదును దొంగ అపహరించుకెళ్లాడు. పోలీసుల కథనం మేరకు.. శెట్టిగుంటరోడ్డు వెంగమాంబ సెంటర్‌లో శైలజ, రామయ్య దంపతులు ఉంటున్నారు. శైలజ తల్లి మస్తానమ్మ సర్జరీ నిమిత్తం గతనెల 29వ తేదీన శ్రీనివాస అగ్రహారంలోని జీకే హాస్పిటల్లో చేరారు. ఆమె వద్ద కుమార్తె, అల్లుడు ఉంటున్నారు. ఇంట్లోని 10 సవర్ల బంగారు ఆభరణాలను శైలజ తీసుకొచ్చి ఆస్పత్రిలోని తన బ్యాగ్‌లో భద్రపరిచింది. మస్తానమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జ్ చేశారు. అయితే రాత్రి కావడంతో పక్కరోజు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకుని నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు వారి గదిలోకి ప్రవేశించి బ్యాగ్‌ను అపహరించాడు. నిద్ర లేచిన శైలజ బ్యాగ్ కనిపించకపోవడంతో అంతా గాలించింది. మొదటి అంతస్తులో బ్యాగ్ కిందపడి ఉంది. అందులోని 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 వేలు నగదు కనిపించకపోవడంతో యాజమాన్యానికి చెప్పింది. వారు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ దుండగుడు శైలజ ఉన్న గదిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.