కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పున ర్విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ హిమాన్హు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు.
ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రఘు నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని కమిషన్ ఆదేశించింది. దీంతో కలెక్టర్ సైతం పూర్తి స్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది.
యువకుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ క్షణికావేశంలో ఓ యువకుడు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్నానది ఎల్‌సీ గేటు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడిని వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఆమె మంగళవారం విజ్ఞప్తి చేశారు.