
ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకుంటాం
● ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు
నెల్లూరు సిటీ: ‘కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని అడ్డుకుని తీరుతాం’ అని ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి తెలిపారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ 12వ జిల్లా మహాసభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ వైపు తీసుకెళ్తోందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వారితో నడపాలని చూస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాధ్యక్షుడు సుందరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, లేకపోతే ఐక్య కార్యాచరణ రూపొందించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. అనంతరం 17 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షుడిగా కృష్ణయ్య, అధ్యక్షుడిగా షేక్ షబ్బీర్, కార్యదర్శగా డి.రమణయ్య కోశాధికారిగా ఎస్‌కే ఖాజావలీ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్‌కుమార్, కట్టా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.