
నాగమ్మ కాలనీలో కార్డన్ సెర్చ్
● 13 మోటార్‌బైక్‌ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుజబుజనెల్లూరు నాగమ్మ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 13 మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏడుగురు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేశారు. నేరనియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయకుమార్, శ్రీనివాసరావు, ఏఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.