
ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగు
● ఎగబాకని ధరలు
● డిమాండ్‌కు మించి పండిస్తూ..
● కోల్డ్ స్టోరేజీ,
సిట్రస్ ఫ్యాక్టరీ నిర్మిస్తేనే ఫలితం
నిమ్మను అతిగా సాగు చేస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతోంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే గడ్డు కాలం ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులతో పాటు రైతులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మెట్ట నియోజకవర్గాల్లో నిమ్మ సాగు నుంచి కర్షకులను విడదీయలేని పరిస్థితులున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో తోటలను సాగు చేస్తూ అందులోనే తమ జీవితం ఉందని వారు భావిస్తున్నారు. కొందరైతే ఇతర పంటలను పండించకుండా, తోటలను నాలుగైదు చోట్ల సాగు చేస్తున్నారు. ఫలితంగా దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఇక్కడ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో నష్టమో, లాభమో కాయలు కోసి యార్డుల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. బయటి రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడం సైతం రైతుల ఇబ్బందులకు కారణమవుతోంది.
పొదలకూరు: ఉద్యాన పంటల్లో నిమ్మ సాగు మేటిగా ఉంది. వెంకటగిరి సమీపంలోని పెట్లూరు వద్ద పరిశోధన స్థానాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో 28,437 ఎకరాలకుపైగా నిమ్మ సాగవుతోంది. ఒక్క పొదలకూరు మండలంలోనే సుమారు నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డును రెండు దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు.
ఎంతో మందికి జీవనోపాధి
సీజన్లో ఇక్కడి నుంచి నిత్యం 15 లారీల్లో కాయలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. ఇలా 300 టన్నుల కాయలు వెళ్తుంటాయి. వందలాది మందికి ఇది జీవనోపాధిగా మారింది. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులకు రెండు వేల నిమ్మ చెట్లున్నాయి. చాలా కాలం పాటు ఇక్కడ పండేదే నిమ్మగా చెలామణి అయింది. అయితే ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సాగవుతోంది. కర్ణాటకలోని బిజాపూర్, తెలంగాణలోని నకిరేకల్.. మన రాష్ట్రానికి పోటీగా మారాయి. మార్కెట్‌ను శాసించే ఢిల్లీకి బయటి రాష్ట్రాల నుంచి కాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ఇక్కడి మార్కెట్ తరచూ తారుమారవుతోంది.
పతనమవుతున్న ధరలు
ఢిల్లీకి కాయలు అధికంగా ఎగుమతవుతున్న నేపథ్యంలో డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో రైతులకు గిట్టుబాటు ధరలూ లభించడం లేదు. ఇక్కడ దాదాపు మూడు నెలలుగా ధరలు ఆశాజనకంగా పెరిగిందీ లేదు. ఈ ఏడాది వేసవిలో కొద్ది రోజులు ధరలు పలికి ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తోటలను తగ్గించుకుంటేనే మేలనే భావన కర్షకుల్లో వ్యక్తమవుతోంది.
కోల్డ్ స్టోరేజీ, సిట్రస్ ఫ్యాక్టరీ అవసరం
పొదలకూరులో కోల్డ్ స్టోరేజీ, సిట్రస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా భావిస్తున్నా, కార్యరూపం దాల్చడం లేదు. ఇదే అంశమై రైతులు విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి ప్రయోజనం లభించడంలేదు. కోల్డ్ స్టోరేజీ ఉంటే కోసిన కాయలను రెండు, మూడు రోజుల వరకు నిల్వ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. నిమ్మను 80 శాతం ఇంటి అవసరాలకు.. మిగిలిన 20 శాతాన్ని కాస్మొటిక్స్, ఆహారోత్పత్తులకు వినియోగిస్తున్నారు. నిమ్మకు అనుబంధంగా ఫ్యాక్టరీని స్థానికంగా ఏర్పాటు చేస్తే రైతులకు ఊరట లభిస్తుంది. ఇలాంటి ఫ్యాక్టరీని పొదలకూరు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో సాగు
ఇలా..
విస్తీర్ణం – 28,437 ఎకరాల్లో
సీజన్లో యార్డు నుంచి
ఎగుమతులు – 15 లారీల్లో..
ప్యాక్ చేసి ఎగుమతి చేసే
కాయలు – 300 టన్నులు
విస్తీర్ణం తగ్గలేదు
తోటల విస్తీర్ణం తగ్గలేదు. నిమ్మకు చీడపీడలు అధికంగా ఉంటాయి. రైతులు సకాలంలో స్పందించి పిచికారీ చేసుకుంటే అదుపులో ఉంటాయి. కాయల ధరలు బాగా పెరిగి ఆర్థికంగా స్థిరపడిన సమయంలో తోటల విస్తీర్ణాన్ని బాగా పెంచారు.
– ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు

ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగు

ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగు

ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగు