
పోలీస్‌స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వెంకటాచలం: తనపై పలుమార్లు దాడి జరిగినా పోలీసులు సరైన న్యాయం చేయడంలేదంటూ వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో పురుగు మందు తాగి మండలంలోని పూడిపర్తికి చెందిన ఆటో డ్రైవర్ తుంగా మస్తానయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుడి సోదరుడు శ్రీనాఽథ్ వివరాల మేరకు.. పూడిపర్తికి చెందిన మస్తాన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేవారు మస్తాన్‌తో తరచూ గొడవపడేవారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో మస్తాన్‌తో గొడవపడి మాకుమ్ముడిగా దాడి చేశారు. ఘటనపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఇరువర్గాలను పోలీసులు పిలిచి రాజీ చేసి పంపారు. తాజాగా గ్రామానికి చెందిన కావలి పెద్ద వెంకటరమణయ్య, కార్తీక్ మరికొందరు తన నివాసంలో ఉన్న మస్తాన్‌పై గురువారం ఉదయం మరోసారి దాడి చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, గ్రామానికి వారొచ్చి మస్తాన్‌తో పాటు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. తనపై దాడికి పాల్పడినా, న్యాయం జరగడంలేదనే మనస్తాపంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును మస్తాన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు గమనించి వెంకటాచలంలోని సీహెచ్‌సీకి.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.