
తప్పుడు కేసులకు భయపడేదిలేదు
● మనీ స్కామ్‌లో డబ్బులు కొట్టేశారు
● కావలిలో కక్ష రాజకీయాలకు ఊతం
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి(అల్లూరు): తప్పుడు కేసులకు భయపడేదిలేదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి గురువారం చేరుకున్న ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తన కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలను తెలియజేశారు. అక్రమ కేసులు మోపి పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని కూటమి ప్రభుత్వం సైకో పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. ప్రశాంతతకు మారుపేరైన కావలిని ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆయన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. మనీ స్కామ్‌లో డబ్బులు దోచుకోవడం.. ఇసుక దందా.. గ్రావెల్.. మైన్స్.. రేషన్ మాఫియాను ప్రశ్నిస్తున్న తనపై కక్షగట్టి తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే వాస్తవాలను ప్రజలు చెప్తారన్నారు. అభివృద్ధిని గాలికొదిలారని చెప్పారు. డిజిటల్ బుక్‌ను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని వివరించారు. తమ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించినా.. కక్షసాధింపు చర్యలకు పాల్పడినా.. అరాచకాలు చేసినా వెంటనే యాప్‌లో పొందుపర్చాలని కోరారు. తాము అధికారంలో వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మాజీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడి వర్గంపై సైతం తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర కృష్ణారెడ్డిదని విమర్శించారు. విలేకరులను సైతం వదలకుండా కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి కక్షసాధింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని తెలిపారు.