
శ్రీవారి దర్శనానికి పది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్ట్‌మెంట్లు నిండాయి. స్వామివారిని 58,628 మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,551 మంది సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
పక్కాగా స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో అమలు చేస్తున్న స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌ను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ఎస్సెన్సీపీఏ ప్రోగ్రామ్ అధికారి స్టెఫీ పేర్కొన్నారు. నెల్లూరు పర్యటనకు గురువారం వచ్చిన ఆమె జిల్లాలోని వరిగొండ, దామరమడుగు తదితర పీహెచ్‌సీల్లో మహిళలకు నిర్వహిస్తున్న పరీక్షలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో 490 క్యాంపులను నిర్వహించి.. 42,192 మందికి స్క్రీనింగ్ పరీక్షలను చేశారని వివరించారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని పెద్దాస్పత్రికి పంపి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రోగ్రామ్ నోడల్ అధికారి బ్రహ్మేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.