
వేడుకగా గంధ మహోత్సవం
చందన్‌మహల్ నుంచి గంధాన్ని గుర్రంపై తీసుకెళ్తూ..
భారీగా హాజరైన భక్తులు
వెంకటాచలం: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా 248వ గంధ మహోత్సవాన్ని వేడుకగా శుక్రవారం నిర్వహించారు. దర్గాకు కిలోమీటర్ దూరంలోని చందన్‌మహల్ నుంచి గంధాన్ని గుర్రంపై గురువారం అర్ధరాత్రి ఊరేగించారు. దర్గా వద్దకు శుక్రవారం ఉదయం ఆరింటికి తీసుకొచ్చారు. కసుమూరు వీధుల్లో మేళతాళాల మధ్య వైభవంగా సాగింది. అనంతరం మస్తాన్‌వలీ సమాధిపై చద్దర్‌ను కప్పి ప్రత్యేక ప్రార్థనలను కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ నిర్వహించారు. ఆపై గంధం బిందెను దర్గా ముజావర్లకు అందజేశారు. భక్తులకు పంపిణీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యారు.
వసతులు కల్పించకపోవడంపై ఆగ్రహం
గంధ మహోత్సవాల నిర్వహణలో భాగంగా భక్తులకు వసతుల కల్పనలో వక్ఫ్‌బోర్డు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రూ.16 లక్షలను వెచ్చిస్తామని చెప్పినా, 40 శాతం కూడా ఖర్చు చేయలేదంటూ గ్రామస్తులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చందన్‌మహల్, మస్తాన్‌వలీ దర్గా ప్రాంగణాల్లో ఎక్కడ చూసినా పారిశుధ్యం లోపించడంతో అధికారులను నిలదీశారు. ఉత్సవాలకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించడంతో, వారు వెళ్లిపోయారు. మరోవైపు దర్గాలో మస్తాన్‌వలీ సమాధిని పూలతో ఏటా అలంకరిస్తారు. అయితే ఈసారి అంతంతమాత్రంగా ఉంటడంతో గొడవకు దిగారు. ఏర్పాట్లు, వసతులు దర్గా ఈఓ పర్యవేక్షణలోనే జరిగాయని, తమకెలాంటి సంబంధంలేదని వక్ఫ్‌బోర్డు సిబ్బంది నచ్చజెప్పేందుకు యత్నించారు. గ్రామస్తులు మండిపడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఈఓ.. చందన్‌మహల్ వద్దకు రాకుండానే ఆగిపోయారు.
తహలీల్, ఫాతేహా నేడు
గంధ మహోత్సవాల్లో భాగంగా తహలీల్ ఫాతేహాను శనివారం ఉదయం నిర్వహించనున్నామని ముజావర్లు తెలిపారు.
అదే పంథా... ఆగని దందా
వెంకటాచలం: కసుమూరులోని మస్తాన్‌వలీ దర్గా గంధ మహోత్సవాల్లో ఏటా భక్తులు నిలువుదోపిడీకి గురవుతూనే ఉన్నారు. భక్తిభావంతో వచ్చిన వారు హుండీల్లో నగదును వేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నా, అధికారులు అడ్డుకట్ట వేయకపోడం వివాదాస్పదమవుతోంది. శుక్రవారం సైతం ఇదే తీరును అవలంబించడంతో భక్తులు గొడవకు దిగారు. గంధ మహోత్సవం పూర్తయిన వెంటనే మస్తాన్‌వలీని దర్శించుకునేందుకు వేలాది మంది పోటీపడ్డారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో దర్గాలో రెండు హుండీలే ఉంటాయి. అయితే మహోత్సవాల సందర్భంగా మరో ఎనిమిది హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, ప్రతి దగ్గర సిబ్బందిని పెట్టారు. దర్గాలోకి ప్రవేశించే ప్రతి ఒక్కర్నీ వదలకుండా అందులో నగదును వేయాలని డిమాండ్ చేశారు. దీంతో భక్తులకు.. హుండీ కాంట్రాక్ట్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది.
విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహణ
కసుమూరులో డైమండ్ డబ్బాను విచ్చలవిడిగా నిర్వహించారు. దర్గాకు కూతవేటు దూరంలో రోడ్డు పక్కన దీన్ని కొందరు నిర్వహకులు గురువారం రాత్రి ఆరు నుంచి వేశారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు వ్యవహారం సాగింది. నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకున్నారు.
జోరుగా మద్యం అమ్మకాలు
గ్రామ నలువైపులా మద్యం విక్రయాలు బహిరంగంగా సాగాయి. వైన్ షాపు నిర్వాహకులు కార్లు, ఆటోల్లో మద్యం బాటిళ్లను తీసుకొచ్చి కొందరితో విక్రయాలు సాగించారు. ఎమ్మార్పీ కంటే రూ.70 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేశారు.
భక్తిశ్రద్ధలతో..
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో 252వ గంధ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. గంధాన్ని ఫయాజ్ ఆధ్వర్యంలో దంచారు. అనంతరం కొబ్బరి దివిటీలు, విద్యుద్దీపకాంతుల నడుమ బాణాసంచా పేలుస్తూ హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాకు చేరుకున్నారు. అక్కడ అమ్మాజాన్, అబ్బాజాన్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా గంధాన్ని పంపిణీ చేశారు.

వేడుకగా గంధ మహోత్సవం

వేడుకగా గంధ మహోత్సవం

వేడుకగా గంధ మహోత్సవం