అధికారుల తప్పిదాలకు సర్పంచ్‌లా బాధ్యులు..? | - | Sakshi
Sakshi News home page

అధికారుల తప్పిదాలకు సర్పంచ్‌లా బాధ్యులు..?

Sep 20 2025 6:36 AM | Updated on Sep 20 2025 6:36 AM

అధికారుల తప్పిదాలకు సర్పంచ్‌లా బాధ్యులు..?

అధికారుల తప్పిదాలకు సర్పంచ్‌లా బాధ్యులు..?

అన్యాయాలపై న్యాయపోరాటం సాగిస్తాం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి తమ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లపై కక్షసాధింపు చర్యలు, ఒత్తిళ్లు అధికమయ్యాయని, వీటికి అధికారులు సైతం వంతపాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నగరంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో గల జిల్లా పంచాయతీ అధికారి ఆఫీస్‌లో డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఎల్పీఓలతో శుక్రవారం ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాలంటూ సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసుల జారీ తదితర అంశాలపై చర్చించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.

వారి తప్పిదాలను రుద్దడం తగదు

సర్పంచ్‌ భర్త కాంట్రాక్ట్‌ పనులు చేయకూడదనే జీఓ ఎక్కడైనా ఉందానని కాకాణి ప్రశ్నించారు. వెంకటాచలంలో బీసీ మహిళ.. పొదలకూరులో ఎస్టీ మహిళ సర్పంచ్‌లుగా ఉన్నారని, వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురి మనోభావాలు దెబ్బతీసేలా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు.

పాలన సాగిస్తోంది పచ్చ పత్రికలా..?

జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు పాలన సాగిస్తున్నారా.. లేక పచ్చ పత్రికలానని కాకాణి ప్రశ్నించారు. అందులో వచ్చిన కథనాలపై షోకాజ్‌ నోటీసులు, స్పందన, నివేదికలు అంటూ.. ఇతర పత్రికల్లో వచ్చిన కథనాలను పట్టించుకోరానని నిలదీశారు. డీఎల్పీఓ విచారణ జరిపి నివేదికలను అందజేస్తే, అవి సక్రమంగా లేవంటూ మరో డీఎల్పీఓతో ఎంౖక్వైరీ చేయించి సర్పంచ్‌లను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శుల తప్పిదాలను సర్పంచ్‌లపై రుద్ది నిధులను దుర్వినియోగం చేశారు.. అక్రమాలకు పాల్పడ్డారని పత్రికల్లో ప్రకటనలిస్తుండటంతో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.

వ్యతిరేకిస్తే కక్షసాధింపా..?

గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మంది సర్పంచ్‌లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులుగా గెలుపొందారని, ఆ సమయంలో తాము హుందాగా వ్యవహరించామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ తరహాలో కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని వివరించారు. పసుపు కండువా కప్పుకొంటే మంచివారంటూ.. వ్యతిరేకిస్తే నిధుల దుర్వినియోగం పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారమెప్పుడూ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులకు హితవు పలికారు. కూటమి నేతలకు అధికారులు ఊడిగం చేస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక వీరిపై విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. పంచాయతీల్లో పనులు చేస్తే బిల్లులివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు పంచాయతీల్లో రూ.లక్షల్లో దుర్వినియోగం జరుగుతోందని, వీటిపై విచారణ జరిపే ధైర్యం ఉందానని ప్రశ్నించారు.

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు

జిల్లాలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పంచాయతీల్లో జరుగుతున్న కార్యక్రమాలకు సర్పంచ్‌లను ఆహ్వానించడంలేదని, ఒక వేళ అలా జరిగినా వేదికపైకి పిలవడంలేదని విమర్శించారు. కూటమి నేతలు చెప్పినట్లే వారు వింటామంటే సర్పంచ్‌లతో గౌరవప్రదంగా రాజీనామా చేయిస్తామన్నారు. సర్పంచ్‌లకు జరుగుతున్న అన్యాయాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నిరసనలు, పోరాటాలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

ఇదేం పద్ధతి..?

వెంకటాచలం పంచాయతీకి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు వీఐపీలు వస్తుంటారని, వారి పర్యటనల సందర్భంగా పారిశుధ్య, ఇతర కార్యక్రమాలను వందలాది మందితో చేయించాలని అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయని తెలిపారు. దీనికి భారీ స్థాయిలో ఖర్చవుతుందని, అయితే వీటిని పరిశీలించకుండా.. బిల్లులు అందుబాటులో ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రూ.లక్షలను దుర్వినియోగం చేశారంటూ సర్పంచ్‌పై నిందలు మోపడం తగదని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement