
సోమశిల నుంచి 27,700 క్యూసెక్కుల విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు నీటి విడుదలను పెంచామని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 73.95 టీఎంసీలకు చేరువలో ఉన్న నేపథ్యంలో.. ఎగువ నుంచి 39 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్న దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 27,700 క్యూసెక్కులను 5, 6, 7వ క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. వరద ఉధృతి తగ్గేంత వరకు కొనసాగుతుందని తెలిపారు. కండలేరుకు 10,450.. ఉత్తరకాలువకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. జలాశయంలో 100.01 మీటర్ల నీటిమట్టం నమోదైందని పేర్కొన్నారు.
టీఏ, ఈసీకి
షోకాజ్ నోటీసుల జారీ
దుత్తలూరు: విచక్షణ మరిచి స్థానిక ఉపాధి కార్యాలయంలో గురువారం దూషించుకున్న టీఏ, ఈసీకి షోకాజ్ నోటీసులను జారీ చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో సిబ్బందిపై డ్వామా పీడీ గంగాభవాని ఆగ్రహం వ్యక్తం చేసి ఘటనపై విచారణ జరిపి నివేదికను అందజేయాల్సిందిగా ఏపీడీ మృదులను ఆదేశించారు. ఈ క్రమంలో కావలిలో ఏపీడీ వద్దకు ఉపాధి సిబ్బంది శుక్రవారం హాజరయ్యారు. దీంతో ఆమె తీవ్రంగా మందలించారని తెలిసింది.
జెడ్పీ స్కూల్లో ఆకస్మిక తనిఖీ
కావలి(అల్లూరు): పట్టణ పరిధిలోని ముసునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇక్కడ సరైన వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశమై పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో తనిఖీ చేశానని వివరించారు. టాయిలెట్లు, నీటి సదుపాయం కోసం అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. టాయ్‌లెట్ల మరమ్మతులు, ఏర్పాటు కోసం రూ.3.3 లక్షలను 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి కేటాయించామన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంచి మార్కులను సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. విజయ దీపిక స్టడీ మెటీరియల్‌ను త్వరలో అందజేయనున్నామని వెల్లడించారు.
భూసేకరణ వేగవంతం
నెల్లూరురూరల్: జిల్లాలోని గుడ్లూరు మండలం చేవూరులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు భూసేకరణను ప్రభుత్వం వేగంగా చేపడుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బీపీసీఎల్ సంస్థను స్థాపించనున్నారని, తద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 49.38 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. వివిధ కాలువలకు 1325 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

సోమశిల నుంచి 27,700 క్యూసెక్కుల విడుదల

సోమశిల నుంచి 27,700 క్యూసెక్కుల విడుదల