
రుస్తుం మైనింగ్ కేసులో ఇద్దరికి బెయిల్
నెల్లూరు (లీగల్): రుస్తుం మైనింగ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏనుగు శ్రీధర్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రుస్తుం మైన్.. ఎస్సీ ఎస్టీ కేసుల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణాధికారిగా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో 11, 12వ నిందితులుగా ఆరోపణలను వీరు ఎదుర్కొంటున్నారు. వీరిని జూలై 21న పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి నుంచి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు రూపేష్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి.. పోలీసులు పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. ఒక్కొక్కరూ రూ.25 వేల చొప్పున స్వయం పూచికత్తు.. రూ.25 వేల ఆస్తి విలువగలిగిన ఇద్దరు జామీన్‌దారులు పూచికత్తు సమర్పించాలని.. పోలీసుల విచారణకు సహకరించాలని.. ఏపీ, తెలంగాణలోనే ఉండాలని.. ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే అనుమతి పొందాలని.. ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు విచారణాధికారి వద్ద హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జొన్నవాడలో 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో గల కామాక్షితాయి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ నెల 22 నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించనున్నామని ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.