
కరేడు రైతుల భూములు కాపాడతాం
● లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్
● ఇదంతా చినబాబు చేస్తున్న కుట్ర
● మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఉలవపాడు: ప్రభుత్వం మెడలు వంచి కరేడు రైతుల భూములు కాపాడతామని రిటైర్డ్ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం కరేడు గ్రామంలో ఆయన రైతన్నతో విజయన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణ చట్ట విరుద్ధమన్నారు. చట్ట ప్రకారం భూమి సేకరించి తర్వాత కంపెనీకి అప్పగించాలన్నారు. కానీ ముందు 8348 ఎకరాల భూమిని మార్చిలో అప్పగించి జూన్‌లో నోటిఫికేషన్ ఇవ్వడమే తప్పన్నారు. ప్రజలను విభజించి పాలించాలనే ఉద్దేశంతో 5 నోటిఫికేషన్‌లు ఇచ్చారన్నారు. ఇది ప్రభుత్వం చేసే కుట్ర అని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల పాటు రూ.14,152 కోట్ల రాయితీ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. కాకినాడ – విశాఖపట్నం మధ్య బీపీసీఎల్‌కు భూ సేకరణ జరిగిన తర్వాత మళ్లీ ఇక్కడ చేవూరులో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నిరాశ్రయులకు కూడా తాను కలెక్టర్‌గా వచ్చిన తర్వాత మేదరమెట్ల వద్ద కాలనీ నిర్మించానన్నారు. కానీ ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదన్నారు. పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు.
ఆలోచన విరమించుకోవాలి
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అధికారంలో ఉంటే ఏం చేసినా చెలామణి అవుతుందన్న ఆలోచన విరమించుకోవాలని, లేకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కారుచవకగా ఇస్తున్నారని చెప్పారు. రిలయన్స్‌కు 5 లక్షల ఎకరాలు కేటాయించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిపారు. అది కూడా త్వరలో బయటకు వస్తుందన్నారు. ఉలవపాడు మామిడి తోటలు కూడా ఉండటం వల్ల సుప్రీంకోర్టులో భూ సేకరణ చేయొద్దని కచ్చితమైన తీర్పు వస్తుందన్నారు. అమరావతిలో సాగు భూములు వద్దని చెప్పినా వినకుండా తీసుకొని 11 ఏళ్ల తర్వాత రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. బీపీసీఎల్, ఇండోసోల్ ఏర్పాటు చేయడం వెనుక తెలుగుదేశం ఎంపీ, పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారన్నారు. వారికి లాభం చేకూర్చడానికి చినబాబు ప్రజలపై చేస్తున్న కుట్ర అన్నారు. తొలుత రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. కరేడు బహిరంగ సభలో రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కరేడు భూములను పరిశీలించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శ్రీదేవి, కరేడు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు, సోషల్ యాక్టివిస్ట్ వసుంధర, సీపీఎం నాయకులు జి.వెంకటేశ్వర్లు, కుమార్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.