టీడీపీలో ‘కాలువ’ కయ్యం | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘కాలువ’ కయ్యం

Sep 7 2025 6:49 PM | Updated on Sep 7 2025 6:51 PM

టీడీపీలో ‘కాలువ’ కయ్యం

టీడీపీలో ‘కాలువ’ కయ్యం

మాలేపాటి మాటలు, దగుమాటి మంటలు

డీఆర్‌ చానల్‌ ఆధునికీకరణ పనుల్లో ఎమ్మెల్యే అక్రమాలు

సీఎంకు ఫిర్యాదు చేసిన సుబ్బానాయుడు

విచారణకు ఆదేశిస్తానని హామీ

రగులుతున్న శాసనసభ్యుడి అనుచరులు

ఆ ఇద్దరూ టీడీపీలో కీలక నేతలు. ఒకరు ఎమ్మెల్యే దగుమాటి. మరొకరు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మాలేపాటి. ఎన్నికల ముందు కలిసి మెలిసి ఉన్నా.. తర్వాత ఇద్దరి మధ్య పరిస్థితి నిప్పు, ఉప్పు అన్నట్లుగా మారింది. దగుమాటి ఏకంగా మాలేపాటిపై క్రిమినల్‌ కేసులు పెట్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంత కాలం మౌనంగా ఉన్న మాలేపాటి తనకు పదవి రావడంతో ఎమ్మెల్యేతో ‘సై’ అంటూ ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఏకంగా సీఎం చంద్రబాబుకే ఎమ్మెల్యే దగుమాటి అక్రమాలపై ఫిర్యాదులు చేయడంతో అధికార పార్టీ నేతల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పరస్పర వర్గాల ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలతో అంతర్యుద్ధం జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీలో ముఖ్య నేతల కలహాలు తార స్థాయికి చేరాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే కావ్య అనుచర వర్గం సాగిస్తున్న గ్రావెల్‌ అక్రమ రవాణాపై బహిరంగంగానే ధ్వజమెత్తిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మాలేపాటి సుబ్బానాయుడు, తాజాగా దగదర్తి–రాచర్లపాడు చానల్‌ ఆధునికీకరణ పనుల్లో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అవినీతిపై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. స్థానిక కాంట్రాక్టర్‌తో కుమ్మకై ్క కాలువ లైనింగ్‌ పనులు మార్చేశారని, ఆయకట్టు రైతులు నష్టపోతున్నారనని ఆయన మీడియా ముందుకు రావడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.

కావ్యతో మాలేపాటి ఢీ అంటే ఢీ

ఈ క్రమంలో బీదకు ఎమ్మెల్సీ పదవి రావడంతో మాలేపాటికి కొంత ఊపిరి వచ్చింది. పార్టీ అధిష్టానం వద్ద బీదకు ఉన్న పరపతితో మాలేపాటికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పదవి ఇప్పించారు. అయినప్పటికీ మండల స్థాయిలో తన వర్గానికి అధికారులు ఏ చిన్న పని కూడా చేయకుండా ఎమ్మెల్యే హుకుం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేతో ఢీ కొట్టేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే అనుచర వర్గం గ్రావెల్‌ అక్రమ రవాణాపై బహిరంగ ఆరోపణలు చేయడంతోపాటు తన వర్గం మట్టి తోలుకుంటుంటే అడ్డగించిన అధికారులతోనే వైరివర్గం యంత్రాలను సీజ్‌ చేయించడంతో ఆ పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది.

సీఎంకు ఫిర్యాదుతో టీడీపీలో కలకలం

తాజాగా డీఆర్‌ చానల్‌ డిజైన్‌ మార్పు విషయంలో సీఎం చంద్రబాబుకు మాలేపాటి ఆధారాలు, ఫొటోలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. వర్క్‌ డిజైన్‌ మార్పుతో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

డీఆర్‌ చానల్‌ వేదికగా రచ్చ

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.26 కోట్లతో దగదర్తి–రాచర్లపాడు చానల్‌ ఆధునికీకరణ పనులు మంజూరయ్యాయి. అయితే ఆ పనిని నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌ దక్కించుకుని సబ్‌ కాంట్రాక్టర్‌కు పని అప్పగించారు. ప్రస్తుతం కొంత భాగం పనులు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఆ పనుల డిజైన్‌ మార్చేసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. కాలువ లైనింగ్‌, పూడికతీతతో పాటు, రెండు చోట్ల సైపన్ల నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఎస్టిమేషన్‌లో ఉన్న సైఫన్‌లు నిర్మించాల్సి ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే అందులో రెండు తొలగించి చేపడుతున్నారనే మాలేపాటి ఆరోపణలు. దీనివల్ల వరద నీరు వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎస్టిమేషన్‌లో పొందుపరిచిన విధంగా కాకుండా డిజైన్‌ మార్చేయడంతో దగదర్తి రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మాలేపాటి చెబుతున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని బహిరంగంగా మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో సంచలనం రేపింది. రెండు వంతెనల నిర్మాణం నిలిపివేసి నిధులు పక్కదారి పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాలేపాటి విమర్శలు చేస్తుంటే.. వాగు పోరంబోకు భూములను ఆక్రమించుకుని, కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అనుచర వర్గం ఆరోపిస్తోంది.

పదవి రాగానే పగ..

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనుచరుడిగా పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న మాలేపాటి గత ఎన్నికలకు ముందు వరకు పార్టీని నడిపించారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీని టీడీపీ నేతలు వదిలేసినా ఆ పార్టీ కి వెన్నుదన్నుగా నిలిచి రూ.కోట్ల ఖర్చు పెట్టుకుని ఎన్నికల ముందు కాడె నెత్తుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ టీడీపీ అధినేత మాలేపాటికి ఝలక్‌ ఇచ్చి వైఎస్సార్‌సీపీ నేతగా ఉన్న దగుమాటిని పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చారు. బీద కూడా తన అనుచరుడికి అన్యాయం చేసినట్లేనని అప్పట్లో పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అయినప్పటికీ పార్టీ విజయం కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయం సాధించడంతో రాజకీయంగా మరో వ్యక్తి తనకు అడ్డుగా ఉండకూడదని భావించారు. మాలేపాటి వర్గాన్నే కాకుండా.. ఏకంగా ఆయన్నే టార్గెట్‌ చేశాడు. నియోజకవర్గ నాయకుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్తగా మార్చేశారు. మాలేపాటి వర్గం అని చెప్పుకునేందుకు కార్యకర్తగా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన చెబితే గ్రామస్థాయి వీఆర్వో కూడా పనిచేయని పరిస్థితి. ఈక్రమంలో మాలేపాటిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించడానికి సైతం ఎమ్మెల్యే వెనుకాడలేదు. ఈ క్రమంలో దగదర్తి మండలంలో మాలేపాటికి వ్యతిరేక వర్గం ఉన్న పమిడి రవికుమార్‌చౌదరిని ప్రోత్సహిస్తూ రావడంతో పార్టీలో ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement