
అన్నం పెట్టే రైతులపై కూటమి రాక్షసత్వం
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
9న అన్నదాతపోరు
● పోస్టర్ ఆవిష్కరించిన
మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆది నుంచి రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, ఎరువులు అడిగితే ముఖ్యమంత్రి, మంత్రి రైతులను, వైఎస్సార్‌సీపీ నేతలను పశువులతో పోల్చుతూ మాట్లాడడం అందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నా నిర్వహించి ఆర్డీఓలకు వినతిపత్రం అందజేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ‘అన్నదాత పోరు’ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధాన సమస్యగా ఉందని, రైతులు క్యూలో నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సిందేనని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇది కామన్ అన్నారు. రైతులకు చెందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి కృత్రిమ సంక్షోభం సృష్టించారని, వ్యవసాయశాఖ మంత్రి దీన్ని పట్టించుకోకుండా రైతులపై చులకనగా మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటన్నారు. అటు యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు. అసలు ఆర్‌బీకేల ద్వారా ఎరువులు, యూరియా ఎందుకు ఇవ్వడం లేదనేది చెప్పాలన్నారు.
ఎడగారు కోతలు.. దోపిడీలో దళారులు
జిల్లాలో ఎడగారు కోతలు మొదలయ్యాయని, ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ప్రవేశించి తక్కువ ధరకు ధాన్యాన్ని దోచుకుంటున్నారన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యానికి గిట్టుబాటు ధర రూ.19,770 ఉంటే దాని కంటే తక్కువగా అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు. ఫలితంగా రైతులు ఒక పుట్టిపై రూ.4 వేలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎడగారు కోతలతో వస్తున్న ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వైఎస్సార్ తెచ్చిన ఉచిత విద్యుత్ , జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాలను కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందిస్తే చంద్రబాబు 46 లక్షల మందికే అన్నదాత సుఖీభవ పథకాన్ని పరిమితం చేశారన్నారు. చంద్రబాబు మొదటి విడత ఎగ్గొట్టి, రెండో విడతలో 8 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఎగనామం పెట్టారన్నారు. అన్నదాతలందరికి ఈ పథకాలు వర్తించేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుని అన్నదాత సుఖీభవను రైతులందరికీ వర్తింపచేయాలని, అధిక వడ్డీలతో పెట్టుబడి తెచ్చుకుంటున్న రైతులను ఆదుకుని బాసటగా నిలవాలన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్లలో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓలకు వినతులు సమర్పించు రైతు సమస్యలను వివరిస్తామన్నారు. వైసీపీ శ్రేణులందరూ ఈ నిరసనలో పాల్గొని రైతులకు అండగా నిలబడాలని పిలుపునిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.