
గ్రామాల్లో స్థానిక సందడి
● మూడు నెలల ముందే సర్పంచ్ ఎన్నికలు ● ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ● జనవరిలో నిర్వహణకు తాత్కాలిక షెడ్యూల్
సీతారామపురం: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వీటికి సిద్ధం కావాలంటూ పంచాయతీ రాజ్ శాఖకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ లేఖలు రాసిన తరుణంలో ముందస్తుగా వెళ్లాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీనికి తగిన విధంగా జిల్లా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసింది.
కసరత్తు షురూ..
వాస్తవానికి సర్పంచ్‌ల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. అయితే మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు కసరత్తును ప్రారంభించింది. తాత్కాలిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది.
ఆశావహులపై అప్పుడే చర్చ
సర్పంచ్ స్థానాలు, వార్డుల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై అప్పుడే చర్చ జోరందుకుంది. జిల్లాలో 940 పంచాయతీలు.. 10,741 వార్డులున్నాయి. జిల్లాలో సుమారు 33.25 లక్షల జనాభా ఉండగా, వీరిలో 24,03,026 మంది ఓటర్లుగా ఉన్నారు. గడువుకు ముందే ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్యకలాపాలను పూర్తి చేయాలని అధికార యంత్రంగాన్ని ఎస్‌ఈసీ అప్రమత్తం చేసింది. తాత్కాలిక షెడ్యూల్ మేరకు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను అక్టోబర్ 15లోపు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అదే నెల 16 నుంచి నవంబర్ 15లోపు సిద్ధం చేసి ప్రచురించాల్సి ఉంది. ఎన్నికల అధికారులను నవంబర్ 15లోపు నియమించాలి. ఆపై పోలింగ్ కేంద్రాలను నవంబర్ 16 నుంచి 30లోపు ఖరారు చేయడం తదితరాలను పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లను డిసెంబర్ 15లోపు ఖరారు చేసి అదే నెల చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించాలి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇచ్చి, ఫలితాలను అదే నెల్లో ప్రకటించాలి.
సజావుగా సాగేనా..?
రెడ్‌బుక్ పేరిట క్షేత్రస్థాయిలో ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఏ పార్టీ మద్దతుదారులకు సర్పంచ్‌గా కూటమి పార్టీలు అవకాశమిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.